ఇంట్లో నుంచి తరిమేశారు
● పోలీసుల ఎదుట వృద్ధురాలి ఆవేదన
● పోలీస్ కార్యాలయంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
నెల్లూరు(క్రైమ్): ‘చిన్న కుమారుడు, కోడలు నా ఆస్తి అమ్ముకుని ఇంట్లో నుంచి తరిమేశారు. జీవనాధారం కష్టంగా ఉంది. విచారించి న్యాయం చేయండి’ అని సీతారామపురానికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతుల వెల్లువెత్తాయి. 180 మంది పాల్గొని వినతులను పోలీసు అధికారులకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎస్పీ అజిత చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, మహిళ, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● కడపకు చెందిన అశ్విన్, కొండారెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.1.50 లక్షలు తీసుకుని మోసగించారు. విచారించి న్యాయం చేయాలని ఆత్మకూరుకు చెందిన ఓ యువకుడు కోరాడు.
● నా భర్త యాక్సిడెంట్‌లో మరణించాడు. స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన మరణంపై అనుమానం ఉంది. లోతుగా దర్యాప్తు చేయాలని పొదలకూరుకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.
● నేను గొర్రెలు మేపుకొని జీవనం సాగిస్తున్నాను. రామతీర్థం ప్రాంతానికి చెందిన భాస్కర్ రూ.4 లక్షల విలువైన గొర్రెలను కొనుగోలు చేసి నగదు ఇవ్వకుండా అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడు. తగిన చర్యలు తీసుకోవాలని అల్లూరుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.


