భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): భార్యను హత్య చేసిన కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఇన్‌స్పెక్టర్ కె.సాంబశివరావు వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు మండలం నెల్లూరుపాళేనికి చెందిన శ్రీనందిని (24)కు నెల్లూరు కోటమిట్టకు చెందిన శ్రీహరితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. శ్రీనందిని తన చిన్ననాటి స్నేహితుడు సుభాష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై దంపతుల నడుమ గొడవలు జరిగాయి. శ్రీనందిని నెల్లూరుపాళెంలోని తల్లి వద్దకు వెళ్లిపోయింది. మూడునెలల క్రితం ఆమె తన స్నేహితుడితో కలిసి మైపాడు బీచ్‌లో ఉండగా భర్త వారిని పట్టుకోగా గొడవ జరిగింది. చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వారిని మందలించి పంపారు. అనంతరం ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరి అప్పుడప్పుడు నెల్లూరుకు వచ్చి భర్తను కలిసి వెళ్లేది. ఆమె తీరు మార్చుకోకుండా స్నేహితుడితో సన్నిహితంగా ఉండసాగింది. దీనిని శ్రీహరి జీర్ణించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో గతనెల 30వ తేదీ రాత్రి నెల్లూరు వస్తున్నానని ఆమె భర్తకు చెప్పింది. బస్సు వద్దకు వస్తానని అతను చెప్పాడు. శనివారం తెల్లవారుజామున చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు వద్ద శ్రీనందిని బస్సు దిగింది. ఆత్మకూరు బస్సు ఎక్కిస్తానని ఆమెను శ్రీహరి స్కూటీపై ఎక్కించుకున్నాడు. చిల్డ్రన్స్ పార్కు రోడ్డులోని పెట్రోల్ బంకు ఎదురు ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్లి కత్తితో ఆమె గొంతు కోసి విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. మృతురాలి తల్లి ఉష ఫిర్యాదుపై కేసు నమోదు చేసి సోమవారం నిందితుడిని అరెస్ట్ చేశామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్‌స్పెక్టర్, ఎస్సై విజయ్ శ్రీనివాస్, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.


