రేషన్ బియ్యం అక్రమ రవాణా కట్టడికి చర్యలు
● తనిఖీలకు మొబైల్ ఫ్లయింగ్ స్క్వాడ్‌లు
● ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్
80083 04495
● జేసీ మొగిలి వెంకటేశ్వర్లు
నెల్లూరు (దర్గామిట్ట) : రేషన్ బియ్యం అక్రమ రవాణా ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు 24 గంటలూ పనిచేసేలా రెండు మొబైల్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులతో కూడిన ఈ బృందాలు రోజూ రెండు షిఫ్టుల్లో పనిచేస్తాయని చెప్పారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక స్క్వాడ్, సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మరో స్క్వాడ్ పనిచేస్తుందని వివరించారు. వీరితోపాటుగా అక్రమ రవాణాపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్ 80083 04495ను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు ఏ క్షణమైనా ఆ ఫోన్ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. కాగా డీలర్లు కొందరు లబ్ధిదారులకు డబ్బులిచ్చి బియ్యం ఇవ్వడం లేదని, దీనిపై ఏమి చర్యలు తీసుకుంటారని జేసీని విలేకరులు ప్రశ్నించగా, అలాంటి ఫిర్యాదులు అందితే తక్షణమే కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని తెలియజేశారు.


