అంబటి రాంబాబు అరెస్ట్ హేయం
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు రూరల్: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయడం అత్యంత హేయమని, ఇది టీడీపీ ప్రభుత్వ నియంతృత్వ పాలనకు నిదర్శనమని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. నగరంలోని పార్టీ నగర కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. అంబటి రాంబాబును అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు ప్రవర్తించిన తీరు.. టీడీపీ గూండాలు చేసిన రౌడీయిజంపై ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువులు, పంది కొవ్వు కలిసిందంటూ ఎలాంటి ఆధారాల్లేకుండా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. సీబీఐ ఇచ్చిన నివేదిక చెంపపెట్టు అన్నారు. సీబీఐ నివేదికకు వ్యతిరేకంగా గుంటూరులో పలు చోట్ల ఫ్లెక్సీలను టీడీపీ నేతలు ఏర్పాటు చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. టీడీపీ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ.. ఆ పార్టీ నేతలకు సద్బుద్ధిని ప్రసాదించాలని స్వామివారికి పూజలు చేసి తిరిగొస్తుంటే.. రౌడీలు, గంజాయి బ్యాచ్‌ను ఉసిగొల్పి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. ఆయన మాటలను వక్రీకరించి.. చంద్రబాబును దూషించారనడం తగదని చెప్పారు. ఆయన ఇంటిపైకి వందల మంది టీడీపీ గూండాలను పంపి విధ్వంసం సృష్టించారని దుయ్యబట్టారు. రెడ్‌బుక్‌లో అంబటి రాంబాబు పేరుంది కాబట్టే, ఆయన్ను ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామాననే దురుద్దేశంతో ఇలా వ్యవహరించారని ధ్వజమెత్తారు. పోలీసుల కళ్ల ముందే ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నా, శాంతిభద్రతలను వారు కూటమి నేతలకు తాకట్టు పెట్టి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అరాచక పాలనను ఏ రాష్ట్రంలోనూ చూసి ఉండరని తెలిపారు. ఇలాంటి వాటికి తమ పార్టీ నేతలు భయపడబోరని స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రజల పక్షాన పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ప్రకటించారు.


