అనుచరుడి కోసం గిరిజనుల గొంతు కోస్తారా?
● వేమిరెడ్డి దంపతులకు
మాజీ మేయర్ సూటి ప్రశ్న
● కరపత్రాల పంపిణీ
అల్లూరు: ‘మీ అనుచరుడి కోసం గిరిజనుల గొంతు కోస్తారా? ఇది ఎంతవరకు సబబు’ అని నెల్లూరు మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి వేమిరెడ్డి దంపతులను ప్రశ్నించారు. ఆమె ఆదివారం అల్లూరు మండలం బోడిసత్రంలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి తనకు, గిరిజనులకు జరిగిన అన్యాయంపై కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం స్రవంతి మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారంగా తనకు మేయర్‌గా అవకాశం లభించిందన్నారు. అయితే వేమిరెడ్డి దంపతులు వారి అనుచరుడి కోసం తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. కోవూరు నియోజకవర్గంలో గిరిజనుల ఓట్లతో గెలిచిన ప్రశాంతిరెడ్డి వారిని అణచడం బాధాకరమన్నారు. బలహీనవర్గాలపై వేమిరెడ్డి దంపతులకు చులకన భావం ఎందుకంటూ మండిపడ్డారు. వెంటనే మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక గిరిజన నాయకులు పాల్గొన్నారు.
రెండో రోజుకు దీక్ష
నెల్లూరు(దర్గామిట్ట): నూతన మేయర్ ఎన్నికకు సంబంధించి తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని గిరిజన నేత పొట్లూరి జయవర్ధన్ డిమాండ్ చేశారు. ఆయన చేపట్టిన రిలే నిరాహారదీక్ష ఆదివారానికి రెండోరోజుకు చేరింది. జయవర్ధన్‌కు పెద్దఎత్తున గిరిజన సంఘాల నుంచి మద్దతు లభించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజనులు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. బీఆర్ అంబేడ్కర్ బలహీనవర్గాలకు కల్పించిన హక్కులను సాధించే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తే ఆమరణ నిరాహారదీక్షకు సైతం పూనుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు.
అనుచరుడి కోసం గిరిజనుల గొంతు కోస్తారా?


