ఎర్రచందనం కేసులో వీడని మిస్టరీ
● కొన‘సాగుతున్న’ దర్యాప్తు
● కనిపించని పురోగతి
ఉదయగిరి: ఉదయగిరి మండలం ఆర్లపడియకు సంబంధించిన అక్రమ ఎర్రచందనం కేసులో నిందితుల ఆచూకీ లేదు. గ్రామస్తులు పట్టించిన ఎర్రచందనం దుంగలు, వాహనం పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినా దర్యాప్తులో పురోగతి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా పోలీసులు దరాప్తు పేరుతో సాగిదీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విచారణ ఉదయగిరి సీఐ వెంకట్రావు పర్యవేక్షణలో సాగుతున్నా ఇంతవరకు నిందితుల ఆచూకీ కనిపెట్టలేదు. దీంతో ఈ వ్యవహారంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఆరంభం నుంచి వివాదమే..
ఆర్లపడియ అటవీ సమీపంలో ఉన్న చెన్నంబావి ప్రాంతంలో ఎర్రచందనం దుంగలతో ఉన్న వాహనాన్ని గ్రామస్తులు జనవరి 18వ తేదీ రాత్రి అడ్డుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఎస్సైలు కలిసి వాహనంతోపాటు ఎర్రచందనం దుంగలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కానీ పోలీసులు ఆ దుంగలను రహస్యంగా పోలీస్‌స్టేషన్‌లో దాచి, వాహనాన్ని పాత పోలీస్ క్వార్టర్స్ ప్రాంతంలో ఉంచారు. ఇలా చేయడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా పక్కరోజు పోలీస్‌స్టేషన్‌లో వాహనం కనిపించకపోవడంతో గ్రామస్తులు మీడియాకు సమాచారం అందించారు. మీడియా ప్రతినిధులు ఈ విషయం గురించి పోలీసులను అడగ్గా మాకు తెలియదని చెప్పారు. ఈ వ్యవహారంపై 20వ తేదీన కథనాలు వచ్చాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు దుంగలు, వాహనాన్ని ఆర్లపడియ వద్ద స్వాధీనం చేసుకున్న ప్రాంతానికి 21వ తేదీన చేర్చి మీడియాను అనుమతించకుండా అటవీ, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా చేసి హైడ్రామా నడిపారు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో దర్యాప్తులో జాప్యం జరుగుతుండటం, నిందితులను అదుపులోకి తీసుకోకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన నిందితుడి ఆచూకీ ఎక్కడ?
అర్లపడియ గ్రామస్తులు పోలీసులకు వాహనం, ఎర్రచందనం దుంగలు, సెల్‌ఫోన్ అప్పుగించారు. సెల్‌ఫోన్‌లో ఉన్న డేటా అధారంగా నిందితులను పట్టుకోవడం ప్రస్తుత టెక్నాలజీ ద్వారా పెద్ద కష్టమేమి కాదు. పైగా పోలీసుల అదుపులో ఉన్న వాహనం వివరాలు ద్వారా కూడా నిందితులను సులువుగా పట్టుకునే అవకాశం ఉంది. కానీ జాప్యం చేస్తుండటంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రధాన వ్యక్తి నెల్లూరు ప్రాంతానికి చెందన పాత ఎర్రచందనం స్మగ్లర్‌గా గుర్తించినట్లు సమాచారం. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని మూలాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అయితే నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ ఘటన జరిగిన రోజు వెంటనే స్థానిక పోలీసులు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేసి ఉంటే ప్రధాన నిందితుడు అప్పుడే చిక్కేవాడని ఆ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మొత్తంగా ఈ ఘటన జరిగిన రోజు పోలీసులు వ్యహరించిన వైఖరి, కీలకమైన ఆధారం ఉన్న ప్రధాన నిందితుడిని పట్టుకోవడంలో జరుగుతున్న జాప్యంతో కేసు పురోగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి.


