అవాస్తవాలని తేలినా మారరా..?
మాట్లాడుతున్న మురళీధర్
● ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్
చిల్లకూరు: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు సాగించిన ప్రచారాలు బూటకమని.. ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ నిగ్గుతేల్చినా, కూటమి నేతల నోర్లు మూతపడటంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మండిపడ్డారు. వారికి సద్బుద్ధిని ప్రసాదించాలని వేడుకుంటూ పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. అనంతరం ఆలయ బయట విలేకరులతో మాట్లాడా రు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ పచ్చ మీడియాలో విష ప్రచారం చేయించారని మండిపడ్డారు. నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తిరుమల విశిష్టతను మరింత పెంచేలా కృషి చేశారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక స్వామివారి సన్నిధిలో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నా, ఆయన మిన్నకుండిపోయారని మండిపడ్డారు. సీబీఐ నివేదిక అనంతరం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఏమీ మాట్లాడకుండా తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారని విమర్శించారు. వారు చెప్పినవన్నీ అబద్ధాలేనని దీని ద్వారా తెలుస్తోందన్నారు. ప్రజలకు వీరు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లడ్డూ ప్రసాదంపై వచ్చి న ఆరోపణలు పటాపంచలు కావడంతో వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసేందుకు బయల్దేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు దాడికి పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి అరాచక పాలనలో ఇంకెన్నాళ్లు ఉండాలాననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోందని చెప్పా రు. పట్టణ, రూరల్ కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్‌రెడ్డి, సీనియర్ నేత ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, చిల్లకూరు మాజీ ఎంపీపీ దువ్వూరు మధుసూదన్‌రెడ్డి, నాశిన నాగులు, కోట, గూడూరు మహిళా విభాగ అధ్యక్షులు రేష్మా, సృజనారెడ్డి, దీప్తి, సురేష్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.


