వైఎస్సార్‌సీపీకి భారీ మెజారిటీ ఖాయం
నెల్లూరు సిటీ: రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయకుమార్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొంది, వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని జీపీఆర్ కల్యాణ మండపంలో పార్టీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారన్నారు. కరోనా కష్టకాలం, ఇతర సమస్యలతో కార్యకర్తలకు సరిగ్గా గుర్తింపు లభించలేదని, ఈ సారి కార్యకర్తలకు పెద్దపీఠ వేయాలని జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారన్నారు. అందుకే గ్రామ, డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలకు గుర్తింపు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతిసారీ చంద్రబాబును నమ్మి మోసపోతున్నామని ప్రజలు అభిప్రాయ పడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం గ్రామాల్లో బెల్టు షాపులు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందన్నారు. కొన్ని గ్రామాల్లో పిక్ పాకిటర్‌లతో డివిజన్ చైర్మన్ అని చెబుతూ పింఛన్‌లు ఇస్తున్నారని, వీళ్ల దగ్గరా పింఛన్‌లు తీసుకునేది అని ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. సర్పంచ్‌లు, కార్పొరేటర్‌లను పక్కన పెట్టి అర్హత లేని వ్యక్తులతో పింఛన్ల పంపిణీలు చేస్తున్నారన్నారు. కొన్ని ఫంక్షన్‌లలో టీడీపీ వర్గీయులే ఈసారి వైఎస్సార్‌సీపీ వస్తుందని చెప్పడం చూస్తున్నామన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని హంగామా చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. ముందు వెంకటేశ్వరస్వామికి పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీ జరగలేదని సీబీఐ తేల్చినా పచ్చ పత్రికలు చంద్రబాబు చెప్పిన విధంగా వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. కోటి సంతకాల సేకరణలో జిల్లాలో రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగిందన్నారు. వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు కడితే తీసివేయడానికి, టీడీపీ వాళ్లు ఫ్లెక్సీలు కట్టేందుకు పోలీసులు పనిచేస్తున్నారన్నారు. ఫ్లెక్సీలు కాపాడుకోవడానికి వందలాది పోలీసులను తీసుకొచ్చారంటే అది వైఎస్సార్‌సీపీ పవర్ అని అన్నారు.
రూరల్‌లో అరాచక పాలన
రూరల్ నియోజకవర్గంలో రౌడీలు, రౌడీషీటర్లు వీధికుక్కల్లా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అరాచక పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి అన్నారు. డివిజన్, గ్రామ కమిటీలతో వైఎస్సార్‌సీపీ రూరల్‌లో బలంగా ఉందన్నారు. ప్రజల పక్షాన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. నెల్లూరు రూరల్‌లో జగన్‌మోహన్‌రెడ్డి పేరు చెప్పుకుని పదవులు అనుభవించిన వారు, తాను చస్తే కొరివి పెట్టాలని మాట్లాడిన వారు ఇప్పుడు మోసం చేసి వెళ్లిపోయారన్నారు. అతని దగ్గర రౌడీలు, రౌడీషీటర్లు ఉన్నారని మండిపడ్డారు. కార్యకర్తలు అభిమానంతో ఫ్లెక్సీలను కడితే వాటిని కూడా తొలగించడం పిరికిపంద చర్యలు అని తెలిపారు.
మళ్లీ సీఎంను చేసుకుందాం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు నిత్యం అండగా ఉంటున్నారని తెలిపారు.
భారీ విజయం తథ్యం
2029 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం దక్కుతుందని ఎమ్మెల్సీ, సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఇబ్బందులకు గురిచేసినా మీ వెంటే నడుస్తామని ప్రతి కార్యకర్త నిలబడుతున్నారన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల కోసం గ్రామ, డివిజన్ కమిటీలు వేశారన్నారు. కార్యకర్తకు ఐడీ కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. పార్టీ కోసం కష్ట సమయాల్లో అండగా నిలిచిన కార్యకర్తలను గుర్తు పెట్టుకుని నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిద్దామని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారన్నారు. 2029 ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయన్నారు.
టీడీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదు
టీడీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భయపడరని ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డిని కచ్చితంగా సీఎం చేసుకుంటామన్నారు. తిరుమల నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ తేల్చి చెప్పినా టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలకు ఐడీ కార్డుతో పాటు బీమా పథకం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని దేశ ప్రధాని మోదీ ప్రశంసించారని గుర్తుచేశారు. రూరల్ నియోజకవర్గ పరిశీలకుడు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్తకు
జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారు
ఇబ్బందులు పెట్టిన వారిని
వదిలే ప్రసక్తే లేదు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీకి భారీ మెజారిటీ ఖాయం


