భార్యను కడతేర్చిన భర్త | - | Sakshi
Sakshi News home page

భార్యను కడతేర్చిన భర్త

Feb 1 2026 3:06 AM | Updated on Feb 1 2026 3:06 AM

భార్యను కడతేర్చిన భర్త

భార్యను కడతేర్చిన భర్త

నెల్లూరు(క్రైమ్‌): భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున బాలాజీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అయోధ్యనగర్‌లో ఓ ఖాళీ స్థలంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. ఆత్మకూరు మండలం నెల్లూరుపాళేనికి చెందిన శ్రీనందిని(24)కి నెల్లూరు కోటమిట్టకు చెందిన శ్రీహరితో ఐదేళ్ల కిందట వివాహమైంది. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. శ్రీహరి ఓ ప్రైవేటు బస్సు సర్వీస్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. శ్రీనందిని మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడంతో దంపతుల నడుమ విబేధాలు పొడచూపాయి. అవి తారస్థాయికి చేరడంతో తొమ్మిది నెలల కిందట భర్త, కుమార్తెను వదిలి ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరూ విడాకులు తీసుకోవాలనుకుని మధ్యలో ఆగిపోయారు. ఈ క్రమంలో భార్య తీరుతో విసిగిపోయిన ఆయన ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకుని అదను కోసం వేచి చూడసాగాడు. మూడునెలల కిందట నందిని బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది. శ్రీహరి ఆమెతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఆమె నెల్లూరు వస్తున్నానని, చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు వద్ద బస్సు దిగుతానని శుక్రవారం రాత్రి భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది. ఆమెను అంతమొందించేందుకు ఇదే సరైన సమయంగా భావించిన శ్రీహరి ఓ కత్తిని తీసుకుని శనివారం తెల్లవారుజామున చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు వద్దకు వెళ్లాడు. బస్సు దిగిన భార్యతో మాట్లాడుకుంటూ అయోధ్య నగర్‌ నాలుగో వీధి ఖాళీ స్థలం వద్ద ఆమెతో గొడవపడ్డాడు. తన వద్దనున్న కత్తితో కడుపులో, గొంతుపై విచక్షణారహితంగా పొడిచి ఆమెను హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.సాంబశివరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి జీజీహెచ్‌ మార్చురీకి తరలించి మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు నెల్లూరుకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి తల్లి ఉమ ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. తల్లి మృతిచెందడం, తండ్రి జైలుకు వెళ్లనుండటంతో అభం శుభం తెలియని చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement