274 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): జాతీయ రహదారిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సీఎస్‌డీటీ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి వెంకటాచలం మండలం గొలగమూడి క్రాస్‌రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహించారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ మొదటి లేన్ చివరలో ఓ లారీ పార్క్ చేసి ఉంచడాన్ని గుర్తించారు. అధికారులు లారీని తనిఖీ చేయగా వివిధ రకాలకు చెందిన 564 సంచుల్లో 274 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. వాటి విలువ రూ.13,28,900గా నిర్ధారించారు. పీడీఎస్ బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్ శబరినాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బియ్యాన్ని నెల్లూరులోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో అప్పగించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం లారీ డ్రైవర్, లారీని వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
తిరుపతి జిల్లాలో సేకరించి..
తిరుపతి జిల్లా తడ మండలానికి చెందిన మధ్యవర్తి హరినాథ్‌రెడ్డి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి వాటిని నెల్లూరు జిల్లాలో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో వెల్లడైంది. సదరు వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆయన దొరికితే ఎవరికి విక్రయిస్తున్నారన్న వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే లారీ డ్రైవర్ మాత్రం కావలికి చెందిన ఓ వ్యక్తి లారీ వద్దకు వస్తాడని చెప్పారని, ఆయన ఎవరన్న విషయం తనకు తెలియదని వెల్లడించినట్లు సమాచారం. దీంతో మధ్యవర్తి, లారీ యజమాని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డ్రైవర్‌పై వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసుతో పాటు అదనంగా నిత్యావసర సరుకుల చట్టం 1955లోని సెక్షన్ 6–ఏ కింద నివేదికను వెంకటాచలం సీఎస్‌డీటీ ద్వారా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ అక్కిశెట్టి శ్రీహరిరావు, కావలి సహాయ పౌర సరఫరాల అధికారి ఇండ్ల పుల్లయ్య, వెంకటాచలం సీఎస్‌డీటీ సైమన్‌బాబు, విజిలెన్స్ తహసీల్దార్ జీఎస్ కృష్ణప్రసాద్, సహాయ ఇంజినీర్ బి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


