మరొకరికి తీవ్రగాయాలు
కలిగిరి: మండలంలోని అయ్యప్పరెడ్డిపాళెం సెంటర్ సమీపంలో 14వ మైలు వద్ద ఎదురెదురుగా మోటార్‌బైక్‌లు ఢీకొన్న ఘటనలో మద్దూరి శ్రీనివాసులు (50) అనే వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జలదంకి గ్రామానికి చెందిన శ్రీనివాసులు బైక్‌పై వింజమూరు వెళ్తున్నాడు. తెల్లపాడు గ్రామానికి చెందిన ఉప్పాల శీనయ్య కావలి మండలం మన్నగిదిన్నెకు బైక్‌పై వెళ్తున్నాడు. అయ్యప్పరెడ్డిపాళెం సెంటర్ సమీపంలో బైక్‌లు ఢీకొన్నాయి.
శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందాడు. శీనయ్య కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. అతడ్ని చికిత్స నిమిత్తం కావలికి తరలించారు. మృతుడు శ్రీనివాసులు వింజమూరులో నివాసం ఉంటూ స్థానికంగా ఉన్న వివేకానంద జూనియర్ కళాశాలలో కేటరింగ్ పనులు చేస్తున్నాడు. జలదంకిలో జరిగిన బంధువుల కర్మక్రియల కార్యక్రమానికి హాజరైన తిరిగి వింజమూరుకు వెళ్తూ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కలిగిరి ఎస్సై ఉమాశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.


