చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరిస్తాం
● ఎస్పీ అజిత
నెల్లూరు(క్రైమ్): చట్టపరిధిలో సమస్యలు పరిష్కరించి న్యాయం చేస్తామని ఎస్పీ అజిత పేర్కొన్నారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 143 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీకి అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, మహిళా పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్ టీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
బెల్టు షాపును తొలగించాలి
ఇద్దరు వ్యక్తులు మా ప్రాంతంలో బెల్టు షాపును ఏర్పాటు చేశారు. 24 గంటలూ మద్యం విక్రయిస్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మందుబాబుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. ఎకై ్సజ్ అధికారులు, స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించ లేదు. బెల్టు షాపును తొలగించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సరస్వతి నగర్ వాసులు కోరారు.
ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నాడు
గుర్తుతెలియని వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్‌లో నా వ్యక్తిగత ఫొటోలు సేకరించాడు. వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పంపించి వేధిస్తున్నాడు. అంతటితో ఆగకుండా నా అకౌంట్‌లోని స్నేహితులందరికీ ఫొటోలు, వీడియోలు పంపుతూ మానసికంగా వేధిస్తున్నాడు. విచారించి న్యాయం చేయాలని సంగం ప్రాంతానికి చెందిన ఓ మహిళ కోరారు.
సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానని..
చేజర్ల మండలానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్‌లో నాకు పరిచయమయ్యాడు. నా వ్యక్తిగత ఫొటోలను తీసుకుని కోర్కెలు తీర్చాలని లేదంటే సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానని బెదిరిస్తున్నాడు. విచారించి న్యాయం చేయాలని చేజర్లకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.
నమ్మించి..
ఒంగోలుకు చెందిన ఖుద్దూస్ ఒంటరిగా ఉంటున్నాని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోకుండా, బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని కావలి రెండో పట్టణ పరిధికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.


