క్రమశిక్షణే పోలీస్ జీవితానికి పునాది
● ఎస్పీ అజిత
నెల్లూరు(క్రైమ్): ‘క్రమశిక్షణే పోలీసు జీవితానికి పునాది. శిక్షణా కాలమే భవిష్యత్ సేవలకు ఆధారం’ అని ఎస్పీ అజిత అన్నారు. ఇటీవల కానిస్టేబుళ్లుగా ఎంపికై న విశాఖకు చెందిన 108 మంది, తిరుపతికి చెందిన 68 మందికి తొమ్మిది నెలల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం చెముడుగుంటలోని డీటీసీలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ శిక్షణ దశ నుంచే విలువలతో కూడిన వృత్తి నైపుణ్యాలు అలవర్చుకుంటే, భవిష్యత్‌లో ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెద్ద సవాలుగా మారాయని, సాంకేతికత ఆధారంగా వాటి కట్టడికి సంబంధించిన అంశాలపై శిక్షణ పొందాలని సూచించారు. కానిస్టేబుళ్ల సమస్యలు, సూచనల కోసం బాక్స్ ఏర్పాటు చేశామన్నారు. శిక్షణా కళాశాల ప్రిన్సిపల్, ఏఎస్పీ సీహెచ్ సౌజన్య మాట్లాడారు. తొలుత ఎస్పీ డీటీసీలో ఆధునికీకరించిన ఆఫీసు గది, బ్యారెక్స్ తదితరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో డీటీసీ, ఎస్‌బీఈ, ఏఆర్, హోంగార్డు, ఆత్మకూరు డీఎస్పీలు గిరిధర్, శ్రీనివాసరావు, చంద్రమోహన్, రమణ, వేణుగోపాల్, ఏఓ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


