ఇంజెక్షన్లు వేసుకుని యువకుడి ఆత్మహత్య
● చనిపోతున్నానంటూ స్నేహితులకు
ఫోన్ చేసి సమాచారం
● ప్రేమ విఫలం కావడంతోనేనా?
వెంకటాచలం: ఇంజెక్షన్లు వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెంకటాచలం సమీపంలోని ఫారెస్ట్ (జామాయిల్ తోట)లో సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కసుమూరు పంచాయతీ చింతలపాళెం గ్రామానికి చెందిన కడివేటి నరసయ్య, వెంకటరమణమ్మ దంపతుల కుమారుడు హేమంత్ (20) ఇంటర్ చదివి నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం వెంకటాచలం సమీపంలోని జామాయిల్ తోటలోకి వెళ్లి ఇంజెక్షన్లు వేసుకుని తాను చనిపోతున్నాంటూ ఫోన్‌లో స్నేహితులకు తెలియజేశాడు. వెంటనే స్నేహితులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే హేమంత్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమితం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రేమ విఫలం కావడంతోనే హేమంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వాస్తవాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కుమారుడి ఆత్మహత్య విషయం తెలియగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదని బోరున విలపించారు.


