అడవి కాదు.. కండలేరు మట్టికట్టే
● కట్ట కూడా కనిపించకుండా కంపకర్ర
● లోపలికి దిగిపోతున్న వేర్లు
● ఇది ప్రమాదమంటున్న రైతులు
పొదలకూరు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద మట్టికట్టగా గుర్తింపు ఉన్న కండలేరు జలాశయం కట్టపై పర్యవేక్షణ కొరవడింది. మోంథా, దిత్వా తుఫానుల కారణంగా కురిసిన భారీ వర్షాలకు జలాశయంలోకి నీరు వచ్చి చేరడంతో అధికారులు హైరానా పడ్డారు. మట్టికట్ట కావడంతో దాని భద్రతపై అనుమానాలున్నాయి. 60 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో స్పిల్‌వే నుంచి నీటిని విడుదల చేయాలని పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. అయితే అక్కడి పరిస్థితిని చూస్తున్న రైతులు నివ్వెర పోతున్నారు. 12 కి.మీ పొడువున ఉన్న కట్టపై ఏపుగా కంపకర్ర పెరిగి కనిపించడం లేదు.
చాలారోజుల క్రితం..
తెలుగుగంగ అధికారులు ప్రతి ఏడాది కట్టపై జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలి. అయితే పనులు చేపట్టి చాలారోజులైంది. దీంతో నేడు అడవిని తలపిస్తోంది. కంపకర్ర వేర్లు కట్ట లోపలకు దిగడంతో ముప్పు ఏర్పడుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023లో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద 3 కి.మీ మేర కంపకర్రను తొలిగించారు. తర్వాత జంగిల్ క్లియరెన్స్ జోలికి వెళ్లలేదని రైతులు తెలిపారు. కండలేరును పర్యాటక కేంద్రంగా రూపొందించేందుకు గతంలో చర్యలు చేపట్టారు. అయితే ఇప్పుడు అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
మూడు మండలాల పరిధిలో..
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు తలమానికంగా ఉన్న సోమశిల, కండలేరు ప్రాజెక్ట్‌ల ద్వారా లక్షలాది ఎకరాల్లో రైతులు పంటలు పండించుకుంటున్నారు. 64 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కండలేరు జలాశయాన్ని నిర్మించారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు 60 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో అటు అధికారులు, ఇటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారు. 12 కి.మీ నిడివి ఉన్న కట్ట జీరో నుంచి 0.50 కి.మీ వరకు చేజర్ల మండలం, 0.50 కి.మీ నుంచి 6 కి.మీ వరకు పొదలకూరు మండలం, 6 కి.మీ నుంచి 12 కి.మీ వరకు రాపూరు మండలంలో ఉంది. పర్యవేక్షణ, వాటర్ డిస్ట్రిబ్యూషన్ కింద 4 సబ్‌డివిజన్ కార్యాలయాలు, అందులో డీఈఈలు, 18 మంది ఏఈలు ఉన్నారు. అయితే ఏళ్ల తరబడి కట్టపై ఏపుగా పెరిగిన కంపకర్రను తొలగించడంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు అంటున్నారు. నిధుల లేమి కారణమా? లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉందంటున్నారు. పటిష్టత కోసం గతంలో నిపుణుల కమిటీ సలహా మేరకు పనులు కూడా చేపట్టారు. తరచూ ప్రాజెక్ట్‌ను పరిశీలించేందుకు నిపుణులు వస్తుంటారు.
స్లూయీజ్‌ల వద్ద కూడా..
మట్టికట్ట స్లూయీజ్‌ల వద్ద కంపకర్ర పెరిగిపోతోంది. లోలెవల్, హైలెవల్ స్లూయీజ్‌లు మట్టికట్టకు ఉన్నాయి. లోలెవల్ నుంచి ఏటికాలువకు నీరు వదులుతారు. అవసరమైనప్పుడు ఎడమగట్టు కాలువ పంపింగ్ స్కీమ్ నుంచి విడుదల చేస్తుంటారు. అయితే ఎడమ కాలువకు ప్రస్తుతం గ్రావిటీ ద్వారానే విడుదల జరుగుతోంది. జలాశయంలో నీరు తగ్గి 30 టీఎంసీలకు పడిపోతే హైలెవల్ స్లూయీజ్‌కు నీరు అందని సమయంలో మాత్రమే పంపింగ్ స్కీమ్‌ను వినియోగించడం జరుగుతుంది. కట్టపై నీరు నిలబడకుండా నిర్మించిన డ్రెయిన్స్ కూడా కంపకర్ర వల్ల మూసుకుపోయాయి. వర్షం కురిసిన సమయంలో కట్టపై నుంచి డ్రెయిన్స్ ద్వారానే నీరు కింద వచ్చేస్తుంది. అవి అక్కడక్కడా ధ్వంసమై ఉన్నాయి.
సబ్ డివిజన్ల వారీగా
అంచనాలు
మట్టికట్టపై జంగిల్ క్లియరెన్స్ కోసం సబ్ డివిజన్ల వారీగా అంచనాలు వేయడం జరిగింది. టెండర్లను పిలిచి వీలైనంత త్వరలోనే పనులు చేపడతాం. నా సబ్‌డివిజన్ పరిధిలో మూడు బిట్లుగా రూ.5 లక్షల వంతున అంచనాలు రూపొందించడం జరిగింది.
– నాగేంద్రబాబు, డీఈ, తెలుగుగంగ
అడవి కాదు.. కండలేరు మట్టికట్టే


