మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించొద్దు
● సీపీఐ ఆధ్వర్యంలో నిరసన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి. దీనిపై పోరాటాలు చేసి జైలుకెళ్లేందుకునైనా సిద్ధంగా ఉన్నాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్ అన్నారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్‌లో గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేశ్‌లు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని ప్రైవేటీకరించే పనిలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉచిత వైద్య విద్యకు దూరమవుతారన్నారు. ఇంకా పేద ప్రజలకు ఉచిత వైద్యం కూడా అందే పరిస్థితి ఉండదన్నారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్యశాలల్లో ఉద్యోగభద్రత, రిజర్వేషన్ హక్కులు దెబ్బ తింటాయన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి, నాయకులు రామరాజు, దామా అంకయ్య, రమణయ్య, మధు, మాలకొండయ్య, సిరాజ్, షాన్‌వాజ్, వినోదిని తదితరులు పాల్గొన్నారు.


