ప్రతి గ్రామంలో చాంపియన్ ఫార్మర్ ఎంపిక
నెల్లూరు(దర్గామిట్ట): సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతిలోని సచివాలయంలో రెండోరోజు గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లాలో చేపట్టిన చాంపియన్ రైతు ప్రాజెక్ట్‌పై ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రతి గ్రామంలోనూ ఒక చాంపియన్ ఫార్మర్‌ను ఎంపిక చేసి మిగిలిన వారికి అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. యాంత్రీకరణ పెంచడం, ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించడం, పంటల విలువ జోడింపు లాంటివి చేపట్టామన్నారు. కేవలం వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించేలా చూస్తున్నామన్నారు. ప్రకృతి సేద్యం, యాంత్రీకరణను ప్రోత్సహించేలా కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు.
విశాఖకు
నిమ్మకాయల ఎగుమతి
పొదలకూరు: స్థానిక ప్రభుత్వ నిమ్మ మార్కెట్ యార్డు నుంచి గురువారం విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రికి నిమ్మకాయలను మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఎగుమతి చేసినట్టు ఏడీఏ అనితాకుమారి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ విశాఖ మార్కెట్ వ్యాపారులు ఇక్కడి కాయలను నాణ్యతను పరిశీలించి మళ్లీ పంపాల్సిందిగా సమాచారం ఇచ్చారన్నారు. మూడు జిల్లాలకు కలిపి మొత్తం 11 టన్నుల కాయలను ఎగమతి చేశామన్నారు. నెలాఖరు నుంచి ఢిల్లీ మార్కెట్‌కు కూడా ఇక్కడి వ్యాపారులను ఎగుమతి చేస్తారని, ధరలు మోస్తరుగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు తమ శాఖ పర్యవేక్షణలో అవసరమైన జిల్లాకు కాయలను ఎగుమతి చేస్తామన్నారు.
విద్యుదాఘాతానికి గురై
వ్యక్తి మృతి
అల్లూరు: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని పురిణి పంచాయతీ తుఫాన్ నగర్ గ్రామంలో గురువారం జరిగింది. అల్లూ రు ఎస్సై శ్రీనివాసులురెడ్డి కథనం మేరకు.. ఇందుపూరు గ్రామానికి చెందిన చెప్పల్లి సురేష్ (36) మరో ముగ్గురితో కలిసి తుఫాన్ నగర్‌లో కొత్తగా కడుతున్న ఓ ఇంటికి సెంట్రింగ్ పనుల నిమిత్తం వెళ్లాడు. 16 అడుగుల బోను పిల్లర్లు పెడుతున్నారు. ప్రమాదవశాత్తు బోను అదుపుతప్పి సమీపంలోని 11 కేవీ విద్యుత్ వైర్లపై పడింది. దానిని పట్టుకుని ఉన్న సురేష్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సురేష్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు.
కండలేరులో
60.600 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం 60.600 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,750 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయిగంగ కాలువకు 1,160, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రతి గ్రామంలో చాంపియన్ ఫార్మర్ ఎంపిక


