32 మంది పిల్లలు.. ఒకరే టీచర్
● వెంకట్రాదిపాళెంలో ఇదీ పరిస్థితి
● తల్లిదండ్రుల ఆవేదన
వింజమూరు(ఉదయగిరి): చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. వాటి బాగోగులు పట్టించుకునేవారు కరువయ్యారు. కనీసం పిల్లలకు పాఠాలు చెప్పేందుకు టీచర్లు కూడా లేని పరిస్థితి ఉంది. వింజమూరు మండలంలోని వెంటాద్రిపాళెం ప్రాథమిక పాఠశాలలో 32 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్ ఉన్నారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు వారే విద్యాబోధన చేయాల్సి ఉంది. దీంతో పిల్లల చదువులు కుంటు పడుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ స్కూల్‌కు ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులుండాలి. వేసవిలో జరిగిన బదిలీల్లో కిస్తీపురం బడికి చెందిన మాలకొండయ్య ఇక్కడికి బదిలీ అయ్యారు. కొన్నిరోజులు వచ్చారు. అయితే రిలీవర్ రాకపోవడంతో కిస్తీపురంలోనే ఉండాల్సి వచ్చింది. దీంతో భాగ్యలక్ష్మి అనే తెలుగు అసిస్టెంట్‌ను (క్లస్టర్ టీచర్) డిప్యుటేషన్ వేశారు. ఆమె వారంలో మూడురోజులు మాత్రమే స్కూల్‌కు వస్తున్నారు. వెంట్రాదిపాళేనికి రవాణా సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో ఆ రోజుల్లో కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. పక్కనే ఉన్న చంద్రపడియలోని ఎంపీపీ స్కూల్లో ఎనిమిది మంది విద్యార్థులుండగా ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో ఒకరిని డిప్యుటేషన్ వేసి సమస్యను తీర్చాలని వెంటాద్రిపాళెంవాసులు కోరుతున్నారు. ఒకే టీచర్ కావడంతో సెలవు పెడితే డిప్యుటేషన్‌పై వేరే వారిని పంపుతున్నారు. దీంతో వారు కూడా బోధన సక్రమంగా చేసే పరిస్థితి లేదు. టీచర్ బుధవారం సెలవు పెట్టడంతో హైస్కూల్ క్లస్టర్ నుంచి డిప్యూటేషన్ వేశారు. మండల ఎంఈఓలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


