20న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
నెల్లూరు(టౌన్): 2025 – 26కు సంబంధించి జిల్లా స్థాయి దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈనెల 20వ తేదీన ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో నిర్వహించనున్నారు. ఇది ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా మండలానికి 3 ఎగ్జిబిట్స్ లెక్కన 114 ఎగ్జిబిట్స్‌ను విద్యార్థులు, టీచర్లు ప్రదర్శించనున్నారు. వ్యక్తిగత, గ్రూపు, టీచర్స్ విభాగాల్లో ప్రదర్శన ఉంటుంది. అత్యుత్తమ ప్రతిభ చూపిన గ్రూపు విభాగంలో 7, టీచర్స్ విభాగంలో 2, విద్యార్థి విభాగంలో 2 ఎగ్జిబిట్స్‌ను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర స్థాయి ప్రదర్శన ఈనెల 23, 24 తేదీల్లో విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌లో జరుగుతుంది. కాగా జిల్లా స్థాయి కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మహమ్మద్ ఫరూఖ్, కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత, జేసీ వెంకటేశ్వర్లు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితోపాటు మిగిలిన ప్రజాప్రతినిధులు, డీఈఓ బాలాజీరావు, ఏపీసీ వెంకటసుబ్బయ్య హాజరుకానున్నారు. బుధవారం జిల్లా సైన్స్ అధికారి శివారెడ్డి మాట్లాడుతూ ఆరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర స్థాయికి ఎంపికన వారికి బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రదర్శనకు సంబంఽధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.


