రెవెన్యూ సదస్సా.. టీడీపీ కార్యక్రమమా?
● ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై
తెలుగు తమ్ముళ్లు
ఉలవపాడు: మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో తహసీల్దార్ శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం రెవెన్యూ సదస్సు జరిగింది. దీనికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ హాజరయ్యారు. నిబంధనల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే స్టేజీపై కూర్చోవాలి. కానీ కూటమి పార్టీల నేతలు కూర్చొని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఉలవపాడు మండల టీడీపీ అధ్యక్షుడు రాచగల్లు సుబ్బారావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కొల్లి అవినాష్, నాయకుడు బెల్లం కృష్ణమోహన్ కూర్చోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. మరో వైపు రెవెన్యూ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నెలల తరబడి తిప్పుకుంటున్నారని, ఇకనైనా మారండి.. లేకుంటే రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. భర్త మరణించిన తర్వాత భార్య పేరుపై మ్యుటేషన్ చేయడానికి కూడా నెలల తరబడి తిప్పుకుంటున్నారన్నారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే కారణాలు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్, సర్పంచ్ గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.


