ఇదీ జరిగింది..
పలు సెటిల్‌మెంట్లలో ఎమ్మెల్యే సురేష్ జోక్యం
జలదంకి మండలం గట్టుపల్లిలో టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్‌నాయుడి హత్యోదంతం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు తలనొప్పిగా మారింది. అదే గ్రామంలో ఓ మామిడి తోట సెటిల్‌మెంట్‌లో ఈయన జోక్యంపై పలు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో హత్య కేసులో శాసనసభ్యుడి పాత్రపై విచారణ కోరుతూ ఎస్పీ అజితా వేజెండ్లకు సదాశివరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ పరిణామాలపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా టీడీపీ అధిష్టానం సైతం ఆరాతీస్తోందని సమాచారం. మొత్తమ్మీద ఈ ఉదంతాలు ఎమ్మెల్యే వర్గీయులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
జలదంకి మండలం గట్టుపల్లిలో 88 ఎకరాల మామిడి తోటపై ఏలూరు జిల్లా ధర్మాజీగూడేనికి చెందిన గారపాటి సదాశివరావు.. కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన తలశిల వెంకటనరసింహరావు మధ్య భూ వివాదం కొన్నేళ్లుగా నడుస్తోంది. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలూ ఉన్నాయి. ఈ క్రమంలో సదరు భూమిలో నరసింహరావు గతేడాదిలో ప్రవేశించడం.. సదాశివరావును కిడ్నాప్ చేయడం.. దీనిపై స్థానికంగా కేసు నమోదు కావడం చకచకా జరిగాయి. ఈ ఉదంతంలో సదాశివరావుకు గట్టుపల్లికి చెందిన గొట్టిపాటి ప్రసాద్‌నాయుడు అండగా ఉన్నారు. దీంతో సదరు తోటను దక్కించుకోవడం నరసింహరావుకు కుదరలేదు. గతేడాదిలో నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ ఆధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేను వెంకటనరసింహరావు ఆశ్రయించారు. ఈ క్రమంలో సెటిల్‌మెంట్‌కు తన సోదరుడు కాకర్ల వెంకట్‌ను ఎమ్మెల్యే పురమాయించారనే ప్రచారం ఉంది.
సాక్షి టాస్క్‌ఫోర్స్: కాకర్ల సురేష్.. ఉదయగిరి ప్రజలకు మూడేళ్ల క్రితం వరకు పరిచయం లేని పేరు. నారా లోకేశ్ ఆశీస్సులతో కాకర్ల ట్రస్ట్ పేరుతో ఈ గడ్డపై కాలు మోపి రాజకీయ పండితులు ఊహించని విధంగా గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ను సాధించి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు షాక్ ఇచ్చారు. ఎలక్షన్లో విజయం సాధించాక.. తనకు అడ్డొచ్చే సొంత పార్టీ వారిని ముందుగానే గుర్తించి అణిచేశారు. దీంతో స్వపక్షంలోనే ఆయనపై తీవ్ర అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. మరోవైపు ఎమ్మెల్యే సురేష్, ఆయన ముఖ్య అనుచరుల కనుసన్నల్లో పలు సెటిల్‌మెంట్లు, వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలొచ్చాయి.
ఫిర్యాదు.. ప్రకంపనలు
ఈ తరుణంలో ఈ ఏడాది మేలో నరసింహరావు తన అనుచరులతో వచ్చి తోటను ఆక్రమించారు. దీనిపై స్థానిక పోలీసులను భూ యజమాని సదాశివరావు ఆశ్రయించగా, ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే ఉన్నారని, వారితో సెటిల్ చేసుకోమని సలహా ఇచ్చారు. దీంతో ఆయన ఎమ్మెల్యే సోదరుడు వెంకట్‌ను సంప్రదించగా, సానుకూల స్పందన రాలేదు. భూమిని విక్రయించాలని, రూ.15 కోట్ల విలువజేసే దీన్ని రూ.2.3 కోట్లుకు అమ్మిపెడతానని చెప్పారు. దీంతో తన భూమి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని గ్రహించి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల క్రమంలో సదాశివరావుకు మద్దతుగా ఉన్న గొట్టిపాటి ప్రసాద్‌నాయుడ్ని కిరాయి హంతకుల ద్వారా నరసింహరావు గత నెల 26న హత్య చేయించారు. ఈ వ్యవహారంలో పోలీసులు, ఎమ్మెల్యే, కొంతమంది స్థానికుల పాత్ర ఉందనీ, పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరుతూ ఎస్పీకి సదాశివరావు ఫిర్యాదు చేశారు. వీరి ద్వారా తన ప్రాణాలకు హాని పొంచి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
భవనాన్ని కూల్చి.. ఆపై ఆక్రమించి
వింజమూరు బంగ్లా సెంటర్‌లో రూ.1.5 కోట్ల విలువజేసే ఓ భవనాన్ని అక్రమంగా కూల్చి, దౌర్జన్యంగా ఆక్రమించడంలో ఎమ్మెల్యే పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. దీంతో భవన యజమానురాలు రోడ్డున పడ్డారు. అగ్రిగోల్డ్ సంపద స్వాహా పర్వంలోనూ శాసనసభ్యుడి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని కొన్ని విలువైన ప్రభుత్వ భూములను చౌకగా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే అంశమై అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. ఈ వరుస ఘటనలతో సొంత క్యాడర్‌లోనే ఎమ్మెల్యే గ్రాఫ్ మసకబారుతోంది.
వత్తాసు పలుకుతున్న స్థానిక పోలీస్ యంత్రాంగం
సంచలనంగా మారిన టీడీపీ నేత ప్రసాద్‌నాయుడి హత్య
శాసనసభ్యుడి పాత్రపై విచారణ కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు
ఆరాతీస్తున్న టీడీపీ అధిష్టానం
సొంత క్యాడర్‌లోనే
మసకబారుతున్న గ్రాఫ్
ఇదీ జరిగింది..
ఇదీ జరిగింది..


