అధికారం అండ.. తమ్ముళ్ల దందా
వింజమూరు (ఉదయగిరి): వింజమూరు మండలం శంఖవరం పంచాయతీ వెంటాద్రిపాళెంలో విలువైన భూమిని అధికార పార్టీ అండతో స్వాహా చేసేందుకు ఓ వ్యక్తి యత్నిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకుంటున్నా.. ఎవరూ లేని సమయంలో గుట్టుచప్పడు కాకుండా ఇందులో పనులు చేపడుతున్నారు. తాజాగా ఆక్రమణ పర్వం బుధవారం మరోసారి జరుగుతుండటంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.
ఇదీ నేపథ్యం..
వెంకటాద్రిపాళెంలోని సర్వే నంబర్ 233 – 1, 233 – 2లో గల 11.55 ఎకరాల్లో 0.5 సెంట్ల చొప్పున 80 మందికి ఇళ్ల పట్టాలను 1994లో అప్పటి ప్రభుత్వం అందజేసింది. కొంత భూమిని గ్రామావసరాల కోసం ఉంచారు. మరోవైపు పక్కా గృహాలను సర్కార్ మంజూరు చేయకపోవడంతో అక్కడ నిర్మాణాలను చేపట్టలేదు. ఇది వింజమూరు – గుండెమడకల ప్రధాన తారు రోడ్డును ఆనుకొని ఉండటంతో ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎకరా విలువ రూ.30 లక్షల వరకు ఉంది. దీంతో టీడీపీకి చెందిన ఓ వ్యక్తికి కన్ను దీనిపై పడింది.
బోగస్ పట్టాలు సృష్టించి..
గ్రామానికి చెందిన బత్తుల భూదేవమ్మ పేరుతో 3.77.. బత్తుల మంగమ్మ పేరుతో 4.90 ఎకరాలకు 2010లో డీ ఫారాలున్నాయి. వీటిని రికార్డుల్లో 2018లో అప్పటి తహసీల్దార్ శ్రీరాములు గుట్టుచప్పడు కాకుండా నమోదు చేశారు. విషయం తెలియడంతో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు షాక్‌కు గురయ్యారు. బోగస్ పట్టాలను సృష్టించి భూమిని కాజేస్తున్నారంటూ అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాటి ఆత్మకూరు ఆర్డీఓ బాపిరెడ్డి విచారణ జరపగా, 47 బోగస్ పట్టాలను మ్యూటేషన్ చేశారని తేలడంతో తహసీల్దార్ శ్రీరాములును సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన తహసీల్దార్ సుధాకర్.. బోగస్ పట్టాల ద్వారా నమోదైన పేర్లను తొలగించగా, ఈ రెండు పేర్లను మాత్రం పట్టించుకోలేదు. ఇదే విషయమై నాటి నుంచి గ్రామస్తులు పోరాడుతూనే ఉన్నారు.
బోర్డు పెట్టారు.. పీకేశారు
గతేడాదిలో టీడీపీ అధికారంలోకి రావడంతో భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారు. వివాదాస్పద భూమిలో ఎవరూ ప్రవేశించకూడదనే బోర్డును అధికారులు పెట్టినా, దాన్ని తొలగించి మరీ తమ పనిని అక్రమార్కులు కానిస్తున్నారు. దాదాపు 20 రోజుల క్రితం జేసీబీతో చెట్లను రాత్రి వేళ తొలగిస్తుండగా, గ్రామస్తులు అడ్డుకొని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి బుధవారం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా ఈ విషయమై వీఆర్వో రవితేజను సంప్రదించగా, ఇళ్ల స్థలాలకు పట్టాలను ఇచ్చారని కొందరు.. డీ ఫారం పట్టాలిచ్చారని మరికొందరు చెప్తున్నారని.. వివాదం జరగడంతో ఇరువర్గాలకు సర్దిచెప్పామని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని బదులిచ్చారు.
విలువైన భూమికి ఎసరు
స్వాహా చేసేందుకు వ్యక్తి యత్నం
అడ్డుకున్న స్థానికులు
చోద్యం చూస్తున్న రెవెన్యూ
అధికారులు
గ్రామంలో ఉద్రిక్తత
బోగస్ పట్టాలు సృష్టించారు
బోగస్ పట్టాలను 2018లో పాత తేదీలతో సృష్టించి పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. అప్పటి ఆర్డీఓ విచారణ జరిపి ఇదే విషయాన్ని గుర్తించినా, రికార్డుల్లో పేర్లను తొలగించలేదు. టీడీపీ ప్రభుత్వం రావడంతో ఎమ్మెల్యే పేరు చెప్పి భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారు. అడ్డుకుంటున్న గ్రామస్తులను బెదిరిస్తున్నారు.
– రత్తయ్య
అధికారం అండ.. తమ్ముళ్ల దందా
అధికారం అండ.. తమ్ముళ్ల దందా


