నిధుల దుర్వినియోగంపై విచారణ నేడు
వింజమూరు (ఉదయగిరి): మండలంలోని కాటేపల్లి పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణను కందుకూరు డీఎల్పీఓ గురువారం జరపనున్నారని డిప్యూటీ ఎంపీడీఓ రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించనున్నారని చెప్పారు. నిధులను దుర్వినియోగం చేసిన సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు చేపట్టడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న వైనంపై ‘లక్షలు మింగేసి.. లక్షణంగా’ అనే శీర్షికన కథనం ప్రచురితమవడంతో అధికారులు స్పందించారు.
జాబ్ మేళా రేపు
నెల్లూరు(పొగతోట): ముత్తుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్‌లో జాబ్‌మేళాను ఏపీఎస్సెస్డీసీ, ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించనున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయ్యూం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14 పరిశ్రమల ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 86398 67407, 87126 55686 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
నెల్లూరు(పొగతోట): యూరియాకు కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అధిక ధరలకు విక్రయించినా, ఎరువులను మళ్లించినా ఏజెన్సీల లెసెన్స్‌లను రద్దు చేసి ఎరువుల నియంత్రణ చట్టం మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 31 నాటికి 52,902 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు 52,173 మేర అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెలాఖరుకు ఆరు వేల టన్నులు రానున్నాయని వెల్లడించారు.
కౌన్సిల్ అత్యవసర
సమావేశం నేడు
నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ కార్యాలయంలోని అబ్దుల్ కలామ్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సర్వసభ్య అత్యవసర సమావేశాన్ని గురువారం ఉదయం 10.30కు నిర్వహించనున్నామని కమిషనర్ (ఎఫ్‌ఏసీ) శ్రీలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కౌన్సిల్ సమావేశాన్ని గురువారం నిర్వహించాలని కలెక్టర్ నిర్ణయించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత శనివారం ప్రకటించారు. ఆపై తన ప్రతినిధుల ద్వారా రాజీనామా లేఖను ఆదివారం పంపగా, దాన్ని కలెక్టర్ ఆమోదించారు. దీంతో అవిశ్వాస తీర్మానం కోసం నిర్ణయించిన కౌన్సిల్ మీట్ కాస్త సాధారణ సమావేశమైంది. మరోవైపు దీన్ని ఎవరో ఒకరి అధ్యక్షతన జరపాల్సి ఉంది. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్‌ను ఇన్‌చార్జి మేయర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించనున్నారు. స్రవంతి రాజీనామాకు ఆమోదం తెలపనున్నారు. ఆపై లేఖను రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారికి కార్పొరేషన్ అధికారులు పంపనున్నారు. పరిశీలన అనంతరం తదుపరి మేయర్ ఎన్నికను ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయం ఎన్నికల కమిషన్‌పై ఆధారపడి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇన్‌చార్జి మేయర్‌గా రూప్‌కుమార్‌యాదవ్ కొనసాగనున్నారు. అయితే దీన్ని జారీ చేస్తారా.. లేక ఆయన్నే కొనసాగించాలంటూ ఉత్తర్వులు విడుదలవుతాయాననే అంశం తెలియాల్సి ఉంది.
శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 63,738 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 19,746 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.79 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


