అసంబద్ధంగా జిల్లా పునర్విభజన
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు రూరల్: అసమర్థుడు అధికారంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దానికి సీఎం చంద్రబాబు చేపట్టిన జిల్లాల పునర్విభజన నిర్ణయం ఉదాహరణగా నిలుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. కలువాయి మండలాన్ని జిల్లాలోనే కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలోకి కాకాణికి పార్టీ నేతలు బుధవారం విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడారు. లేని సమస్యలను సృష్టించి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను జిల్లా నుంచి విడగొట్టడంపై మండిపడ్డారు. పార్టీ ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డితో కలిసి కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. గూడూరు నియోజకవర్గాన్ని జిల్లాలో కలుపుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్ హామీలను గుప్పించారని, అయితే దాన్ని అమలు చేయకపోగా, జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చడం దారుణమని చెప్పారు. ఈ దుర్మార్గపు నిర్ణయాలు భావితరాలకు శాపాలుగా మారనున్నాయని తెలిపారు. ఈ మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చడంతో అక్కడి ప్రజలు తమ అస్థిత్వాన్ని కోల్పోతారని, జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్లు వెళ్లాలంటే ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంటుందని వివరించారు. జిల్లా రైతాంగంతో సాగునీరు, రెవెన్యూపరమైన అంశాలతో ముడిపడి ఉన్నాయన్నారు.
సర్వేపల్లి రైతులకు కష్టాలు తప్పవు
ప్రజా సమస్యలను తెలియజేసేందుకు ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చారని గుర్తుచేశారు. జిల్లాల పునర్విభజనలో స్థానిక ప్రజల సమస్యలను ఆనాడు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించి వాటిని జిల్లాలోనే కొనసాగించారని తెలిపారు. జిల్లా నుంచి ఈ మండలాలు విడిపోతే సర్వేపల్లి రైతులకు సాగునీటి కష్టాలు తప్పవన్నారు. నియంతలా చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాకు చెందిన టీడీపీ నేతలు నోరుమెదపడం లేదని విమర్శించారు.
జిల్లా ప్రజలకు తీరని ద్రోహం
లేఖలు రాస్తూ మభ్యపెట్టేందుకు సోమిరెడ్డి యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో జిల్లా ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో చేర్చిన విధంగా, గూడూరు ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికార పార్టీ నేతలు తమ రాజకీయ ప్రయోజనాలను విడిచి, జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం చంద్రబాబు వద్ద తమ గళం వినిపించాలని కోరారు.


