మున్సిపల్ కార్మికుల వినూత్న నిరసన
● కార్పొరేషన్ కార్యాలయ ఎదుట వంటావార్పు
నెల్లూరు(బారకాసు): తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో పారిశుధ్య కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కార్మికులు ఉదయం ఆరింటికే కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వంటావార్పు అనంతరం అక్కడే భోజనాలు చేశారు. నిరసనలో భాగంగా కోలాట ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, సీఐటీయూ నగర కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం 44 రోజులుగా ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో సమ్మె చేపట్టిన 14 రోజులకు సంబంధించిన వేతనాల విషయమై మంత్రి నారాయణతో చర్చలు జరిపిన అనంతరం వీటిని అందిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, కమిషనర్ ప్రకటించారని, అయితే నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు పట్టించుకోవడంలేదని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో దాదాపు 136 మంది కార్మికులను 60 ఏళ్లు నిండాయనే కారణంతో అర్ధాంతరంగా ఇళ్లకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. సమస్యలను ఇప్పటికై నా పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రకటించారు. నేతలు కత్తి శ్రీనివాసులు, పెంచలనరసయ్య, సుధాకర్, సూరినారాయణ, చైతన్య, నరసింహ, రాజా, అశోక్, దేశమూర్తి, సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల వినూత్న నిరసన


