లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం
నెల్లూరు (లీగల్): కక్షిదారులు రాజీపడొస్తే లోక్ అదాలత్‌లో సత్వర న్యాయాన్ని అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్ ఆయన మాట్లాడారు. కేసులను రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. అనంతరం ఓ కేసులోని బాధితులకు రూ.కోటి చెక్కును ఆయనతో పాటు జేసీ వెంకటేశ్వర్లు, ఎస్పీ అజితా వేజెండ్ల, కమిషనర్ నందన్ అందజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 58,191 కేసులను పరిష్కరించారు, లబ్ధిదారులకు రూ.30,48,38,493ను చెల్లించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. కోవూరులో 5450, కావలిలో 5269, ఆత్మకూరులో 2175, ఉదయగిరిలో 3274, గూడూరులో 1077, వెంకటగిరిలో 5210, కోటలో 1521, నాయుడుపేటలో 2161, సూళ్లూరుపేటలో 2711 కేసులు పరిష్కారమయ్యాయి. నెల్లూరులోని వివిధ కోర్టుల్లో కేసుల పరిష్కారానికి తొమ్మిది ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్ అధికారులుగా న్యాయమూర్తులు గీతా, శ్రీనివాస్, సోమశేఖర్, శ్రీనివాస్, స్వాతి, భరద్వాజ్, శారద, అబ్దుల్ రహిమాన్, నిషాద్‌నాజ్, మెంబర్లుగా సీనియర్ న్యాయవాదులు శ్రీనివాసరావు, శిఖివాహన్, కృష్ణయ్య, శేఖర్ వ్యవహరించి 30,343 కేసులను పరిష్కరించారు. వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


