ఆ బడికి.. అయ్యోరే శాపం
వింజమూరు (ఉదయగిరి): కొందరు ఉపాధ్యాయులు, మరికొందరు విద్యాశాఖాధికారుల వైఖరికి ప్రభుత్వ విద్యా వ్యవస్థకు పాతరేసే దిశగా అడుగులు పడుతున్నాయి. నెలనెలా జీతాలు తీసుకుంటూ.. కనీసం వారానికొక్కసారి కూడా విధులకు హాజరు కాకుండా గ్రామీణ పేద విద్యార్థుల భవిష్యత్‌ను శాపంగా మారుస్తున్నారు. ఇటువంటి ఉపాధ్యాయుల మూలంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు రాక మూత పడే పరిస్థితి వస్తోంది. ఇలా ప్రభుత్వ పాఠశాలలు మూత పడితే.. భవిష్యత్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయ వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాద ఘట్టికలు మోగుతున్నాయి. తాజాగా వింజమూరు మండలం జనార్దనపురం నుంచే తొలి అడుగులు పడుతున్నాయి.
ఆ ఉపాధ్యాయుడు రాకతో తిరగబడిన
బడి రాత
ఆ గ్రామంలో మొత్తం 850 మంది జనాభా. అందరూ రూ.వేలల్లో ఫీజులు కట్టి ప్రైవేట్ పాఠశాలల్లో చదివించలేదని పేదలే. 2021 విద్యా సంవత్సరానికి ఐదుగురు ఉపాధ్యాయులు, 70 మంది పిల్లలతో ప్రాథమికోన్నత పాఠశాలగా ఉండేది. అదే విద్యా సంవత్సరంలో ఆవుల రాజు అనే ఉపాధ్యాయుడు ఈ పాఠశాలకు బదిలీ కావడంతో ఆ బడి రాత తిరగబడింది. మిగతా ఉపాధ్యాయులు సైతం ఇతని చేష్టలు బరించలేక వేరే పాఠశాలలకు బదిలీ అయిపోయారు. అప్పటికే విద్యార్థుల సంఖ్య సైతం సగానికి పడిపోయింది. సదరు ఉపాధ్యాయుడు తన సొంత పనులతో కనీసం వారానికి ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిల్లల చదువులు కుంటుపడ్డాయి. గ్రామస్తులు ఉన్నతాధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. దీంతో గత్యంతరం లేక పిల్లల భవిష్యత్ కోసం అప్పులు చేస్తూ ప్రైవేట్ స్కూల్స్‌కు పంపుతున్నారు. గతేడాది 33 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారు. వీరు కడు పేదలు కావడంతో ప్రైవేట్‌కు పంపే స్తోమత లేక ఆగిపోయారు. వచ్చే ఏడాది ఇక్కడ ఉంచమని చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
అటెండర్‌తో చదువులా?
జనార్దనపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆవుల రాజు తరచూ విధులకు డుమ్మా కొడుతున్నాడు. సదరు ఉపాధ్యాయుడు ప్రస్తుతం డిసెంబరులో 2వ, 12వ తేదీ మాత్రమే పాఠశాలకు వచ్చారు. మిగతా 8 రోజులు మెడికల్ సెలవులో ఉండడం గమనార్హం. ఇటీవల కూడా ఇదే పరిస్థితి వచ్చినా.. విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో శనివారం కూడా మరోసారి అటువంటి పరిస్థితే ఏర్పడింది. ఇతని స్థానంలో మరో టీచరును డిప్యుటేషన్‌పై వేయాలి. కానీ ఎంఈఓ మధుసూదన్‌రెడ్డి తన కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసే బి.శ్రీహరిని చదువు చెప్పడానికి కు పంపించారు. ఈ విషయమై ఎంఈఓను వివరణ కోరితే కావలిలో జరిగే ఆటల పోటీలకు 28 మంది టీచర్లు వెళ్లినందున సర్దుబాటులో సమస్య వచ్చిందన్నారు. ఎంఈఓ, టీచరు మధ్య పరస్పర అవగాహనతో జరుగుతున్న ఈ విషయం మండలంలోని అందరూ టీచర్లకు తెలిసిందే.
టీచర్‌కు కొమ్ముకాస్తున్న ఎంఈఓ
ఉపాధ్యాయుడు రాజు గత ఏప్రిల్‌లో జరిగిన బదిలీల్లో జలదంకి మండలం మేములపాడుకు బదిలీ ఆయ్యారు. అయితే జనార్దనపురానికి రిలీవర్ రాకపోవడంతో ఇక్కడే కొనసాగుతున్నారు. అంటే విధులు జనార్దపురంలో.. వేతనం జలదంకి మండలంలో తీసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు టీచర్ హాజరు పట్టీ పరిశీలిస్తే ప్రభుత్వం ప్రకటించిన సెలవులే కాకుండా 31 సీఎల్, 14 ఈఎల్, 33 మెడికల్ లీవులు పెట్టారు. మరి నెలనెలా పూర్తి వేతనం తీసుకుంటున్నారని, అయితే సర్వీస్ రిజిస్టర్‌లో (ఎస్సార్)లో మెడికల్, ఈఎల్‌లు నమోదు కావడం లేదని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరి ఎంఈఓలకు తెలియకుండా, వారి పాత్ర లేకుండా ఇదేలా సాధ్యమా అనేది అంతుచిక్కని ప్రశ్న. జిల్లా అధికారులు ఇలాంటి పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
అభివృద్ధి చెందిన పాఠశాల
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
నాడు–నేడు కింద అభివృద్ధి
ఐదుగురు ఉపాధ్యాయులు,
70 మంది విద్యార్థులు
గతేడాదిలో 33 మంది..
ఈ ఏడాది నలుగురే
విద్యాశాఖ ఉదాసీనత..
విద్యార్థుల భవిష్యత్ పాతర
ఫలితంగా పాఠశాల శాశ్వత మూత దిశగా అడుగులు
ప్రజాధనాన్ని రూ.లక్షల్లో జీతాలు తీసుకునే విద్యాశాఖాధికారులు, రూ.వేలల్లో జీతం తీసుకునే అయ్యోరు బరితెగించారు. విధులకు డుమ్మా కొట్టి.. అధికారులకు ముడుపులు కొట్టి.. బోధనకు మట్టి కొట్టి.. విద్యార్థుల భవిష్యత్‌కు శాశ్వతంగా పాతరేశారు. ఓ అయ్యోరు.. తన బాధ్యతలను విస్మరించి, విధుల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, స్వార్థ పూరితంగా వ్యవహరించడంతో ఆ బడికి శాపంగా మారింది. ఆ గ్రామం మొత్తం ప్రభుత్వ విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. వచ్చే విద్యా సంవత్సరానికి ఆ బడి విద్యాశాఖ రికార్డుల్లో శాశ్వతంగా మూతబడి పోనుంది.
మారుమూల ప్రభుత్వ పాఠశాల కావడంతో విద్యార్థుల భవిష్యత్‌ను కాంక్షించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్‌లో రూ.6 లక్షలు ఖర్చు పెట్టి మరుగుదొడ్లు, భవనాల ఆధునికీకరణతోపాటు తరగతి గదుల్లో వసతులు తదితర సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు సదరు ఉపాధ్యాయుడి నిర్వాకం కారణంగా విద్యార్థుల్లేని పరిస్థితికి వచ్చి మరో ఏడాదికి ఈ పాఠశాలను శాశ్వతంగా మూతవేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదే జరిగితే ఈ గ్రామానికి విద్యశాపంగా మారుతోంది. మరో వైపు ఆధునికీకరించిన పాఠశాల భవనాలు నిరుపయోగంగా మారనున్నాయి.
ఆ బడికి.. అయ్యోరే శాపం


