అక్రమ కేసులకు భయపడేది లేదు
● పిన్నెల్లి సోదరులను జైల్లో పెట్టడం అన్యాయం
● మాజీ మంత్రి కాకాణి
గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: చంద్రబాబు, లోకేశ్‌లు వైఎస్సార్‌సీపీ నేతలపై పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసు కారణంగా జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంక్రటామిరెడ్డితో కాకాణి శనివారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడులో మే నెలలో ఒక వర్గం టీడీపీ నాయకులు మరో వర్గానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులను స్కార్పియో వాహనంతో గుద్ది చంపడం జరిగిందన్నారు. ఇరువర్గాలు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి వర్గీయులేనని, చనిపోయిన వ్యక్తుల కుటుంబీకులు మరో వర్గం టీడీపీ నాయకులు చంపారని చెప్పడం, స్వయానా జిల్లా ఎస్పీ ఒక వర్గం టీడీపీ నాయకులను, మరో వర్గం టీడీపీ నేతలు చంపినట్లు ప్రకటించారన్నారు. అయితే అన్యాయంగా ఈ కేసులో పిన్నెల్లి సోదరులను ఇరికించి కక్ష సాధింపులకు పాల్పడటం దారుణమన్నారు. ఈ కేసుకు సంబంధించి పిన్నెల్లి సోదరులు హైకోర్టును ఆశ్రయించగా ఇంటిరియమ్ ప్రొటెక్షన్ ఇవ్వగా, తప్పుడు పత్రాలు సృష్టించి రద్దు చేయించారని తెలియజేశారు. ఆ తరువాత పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రొటెక్షన్ లభించిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వానికి సర్కార్ లాయర్లు ఉన్నా, లక్షలు రూపాయలు ఖర్చు చేసి సిద్థార్థ్ లూథ్రా వంటి లాయర్‌తో వాదించగా ప్రొటెక్షన్ రద్దు చేయడంతో సుప్రీంకోర్టు రెండు వారాలలోపు లొంగిపోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోవడంతో కోర్టు రిమాండ్ విధిస్తూ, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారన్నారు. చంద్రబాబుకు పాలనపై పట్టు కోల్పోవడంతో పాటు, పార్టీ పరంగా కూడా దారుణంగా ఉండటంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సొంత పార్టీ నాయకులు అదే పార్టీ నాయకులను చంపేస్తుండటంతో చంద్రబాబు పనైపోయిందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు, లోకేశ్‌లు వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమ కేసుల్లో ఇరికిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. గుండ్లపాడులో జరిగిన హత్య కేసులో పిన్నెల్లి సోదరులకు ఎలాంటి సంబంధం లేకున్నా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి జైలు పాలు చేయడం దుర్మార్గమన్నారు. గతంలోనే ఓ కేసులో ఇరికించడంతో 54 రోజులపాటు జైలులో ఉండాల్సి వచ్చిందన్నారు. మళ్లీ ఈ హత్య కేసులో అనేక కుట్రలు చేసి జైలుకు పంపడం మంచి పద్ధతి కాదన్నారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులను ఎవరు చంపారో స్పష్టమైన ఆధారాలు ఉన్నా పిన్నెల్లి సోదరులను ఇరికించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జైల్లో కూడా అనేక ఇబ్బందులు పెట్టేలా కుట్రలు చేయడం సిగ్గు చేటన్నారు. పోలీసులు కూడా కూటమి నాయకులకు వంతుపాడుతూ అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. పోలీసులు తమ విధులను పక్కన పెట్టి కూటమి నాయకులు చేసే పాపాల్లో భాగస్వాములు కావడంతో జిల్లాలోనూ అరాచకాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు అధైర్యపడి వణికిపోయే పరిస్థితి ఉండదని, న్యాయ పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతామన్నారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు ఉన్నారు.


