ప్రజా ప్రతినిధులు బిజీబిజీ
నెల్లూరు(పొగతోట): కూటమి ప్రభుత్వంలో మంత్రులు, శాసనసభ్యులు ప్రజల సమస్యలపై చర్చించేందుకు తీరికలేకుండా పోయింది. జిల్లాలో వివిధ సమస్యలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే వాటిపై చర్చించేందుకు కూటమి నేతలకు సమయం దొరకలేదు. గూడూరును నెల్లూరులో విలీనం చేయాలని ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కందుకూరు సమస్య మరో పక్క వెంటాడుతోంది. ఇది కాక రైతులు యూరియా దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. తుపాన్ల వల్ల పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. నష్టపరిహారం రైతులకు అందలేదు. శ్రమించి పంటలు పండించిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. ఇటువంటి సమస్యలపై చర్చించేందుకు ప్రజా ప్రతినిధులకు వీలుకుదరలేదు. శనివారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు హాజరుకాలేదు. కావలి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి, నెలవల విజయశ్రీ మాత్రమే హాజరయ్యారు. వారు కూడా సమస్యలేమీ లేవన్నట్లు కొద్దిసేపు కూర్చిని వెళ్లిపోయారు. గత నెలలోనూ ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు.
విజయదీపిక ఆవిష్కరణ
పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన విజయదీపిక స్టడీ మెటీరియల్‌ను జెడ్పీ చైర్‌పర్సన్, జేసీ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు, శాసనసభ్యులు ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 418 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 20,500 మంది పదో తరగతి విద్యార్థులకు విజయదీపికను అందించనున్నారు.
ఆ మండలాలను నెల్లూరులో కొనసాగాలి..
కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సమావేశంలో తీర్మానం చేశారు. సభ్యులందరూ తీర్మానాన్ని బలపరిచారు. దీనిని ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామని జెడ్పీ చైర్‌పర్సన్, సీఈఓ తెలిపారు.
రూ.1.50 కోట్లతో నూతన గెస్ట్‌హౌస్
పాత జెడ్పీ గెస్ట్‌హౌస్ శిథిలావస్థకు చెరుకోవడంతో దానికి కుల్చివేశారు. నూతన జెడ్పీ ఆవరణలో రూ.1.50 కోట్లతో కొత్త గెస్ట్‌హౌస్ నిర్మాణానికి తీర్మానం చేశారు. ప్రభుత్వం నుంచి త్వరగా అనుమతి తీసుకుని గెస్ట్‌హౌస్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు.
బడ్జెట్ ఆమోదం
సమావేశంలో డిప్యూటీ సీఈఓ జెడ్పీ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాలతో రూ.61,07,26,000 ఆదాయం కాగా రూ.61,06,73,896లు ఖర్చుగా బడ్జెట్ రూపొందించారు. రూ.52,104 మిగులు బడ్జెట్‌తో అంచనాలు సిద్ధం చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలతో రూ.76,45,62,703లు ఆదాయం. రూ.71,98,30,376 లు ఖర్చుగా బడ్జెట్ చూపించారు. దీనికి సభ్యులందరూ ఆమోదం తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
తీసుకోవాలి – జెడ్పీ చైర్‌పర్సన్
సమావేశంలో సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్ సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా యూరియా సరఫరా చేయాలన్నారు. తుపాన్ల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతుల పంటను మద్దతు ధరలకే కొనుగోలు చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు డక్కిలి జెడ్పీటీసీ రాజేశ్వరమ్మ మృతికి సంతాపంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కలువాయిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని తీర్మానం చేయాలంటూ కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు బి.అనిల్‌కుమార్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులందరూ కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేలా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని కోరారు. కలువాయి మండలాన్ని ఆత్మకూరు డివిజన్‌లో కొనసాగించాలన్నారు.
జెడ్పీ సమావేశానికి
మంత్రులు, ఎమ్మెల్యేల డుమ్మా
ప్రజా సమస్యలపై చర్చించేందుకు
తీరికలేని నేతలు
యూరియా కొరతపై సభ్యుల నిలదీత
పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్


