బాధితులకు సత్వర న్యాయం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసులను పారదర్శకంగా పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. డివిజన్ల వారీగా నమోదైన అట్రాసిటీ కేసులపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్‌లో 147 కేసుల్లో రూ.1.74 కోట్లు, నవంబర్‌లో 48 కేసుల్లో రూ.36.75 లక్షలు నష్టపరిహారంగా బాధితులకు చెల్లించినట్లు చెప్పారు. ఇంకా 65 కేసుల్లో రూ.94 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎస్పీ డాక్టర్ అజిత మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులను రాజకీయాలు, పార్టీలకతీతంగా పారదర్శకంగా నమోదు చేస్తున్నామని చెప్పారు. అక్రమ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని స్టేషన్ల పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి మాట్లాడారు. తొలుత కమిటీ సభ్యులు జిల్లాలోని పలు సమస్యలపై ప్రస్తావించారు. సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, కావలి, ఆత్మకూరు ఆర్డీఓలు వంశీకృష్ణ, పావని, డీఎస్పీలు శ్రీనివాసరావు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
● సభ్యులు ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ చాలా వరకు తప్పుడు కేసులు కడుతున్నారన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత పోలీస్ అధికారులు కేసులు కట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సాయిప్రసాద్ మాట్లాడుతూ పోలీసు కేసులు చాలావరకు తప్పులుగా ఉన్నాయని, కావలి, కందుకూరు, విడవ లూరు ఇలా చాలా పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. గంధం శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల్లో సమన్వయం కొరవడిందని, దానిని సరి చేసుకోవాలని కోరారు. దుంప ఏసోబు మాట్లాడుతూ ఎస్సీలకు సంబంధించి నోటీసులివ్వకుండా మీ ఇల్లు రోడ్ వైండింగ్‌లో పోతోందని తోటపల్లిగూడూరులో కూల్చారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు భూ పట్టాలు మంజూరు చేయాలని కోరారు.


