అనుమతుల్లేని గ్యాస్ ఏజెన్సీపై కేసు
● 133 ఫుల్, 92 ఖాళీ సిలిండర్లు,
రెండు వాహనాల స్వాధీనం
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని రామ్ గ్యాస్ ఏజెన్సీపై విజిలెన్స్, రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. అనుమతి లేకుండా ఏజెన్సీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారి కథనం మేరకు.. రూరల్ మండలంలోని కొత్తకాలువ సెంటర్ వద్ద ఉన్న గ్యాస్ ఏజెన్సీలో గురువారం తనిఖీలు జరిగాయి. ఏజెన్సీకి ప్రభుత్వం నుంచి అనుమతుల్లేవని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. అదేవిధంగా పీఈఎస్‌ఓ లైసెన్స్, ఫైర్ డిపార్ట్‌మెంట్ ఎన్‌ఓసీ లేకుండా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారని గుర్తించారు. విక్రయాలకు సిద్ధంగా ఉంచిన రూ.6.87 లక్షల విలువైన కమర్షియల్ సిలిండర్లు 133, 92 ఖాళీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలించే రెండు అశోక్ లేలాండ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 6ఏ కేసు నమోదు చేశారు. కాగా సిలిండర్లను భద్రంగా ఉంచేందుకు పీఎంకేఆర్ భారత్, శ్రీవెంకయ్య స్వామి, శ్రీకార్తీ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలకు తరలించారు. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ శ్రీహరి, రూరల్ తహసీల్దార్ ఎస్.కృష్ణప్రసాద్, సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ వెంకటరెడ్డి, సహాయ పౌరసరఫరాల అధికారి లక్ష్మీనారాయణరెడ్డి, డీటీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అనుమతుల్లేని గ్యాస్ ఏజెన్సీపై కేసు


