రైతుల పేరుతో సోమిరెడ్డి దోపిడీ
పొదలకూరు: రైతుల పేరుతో దోపిడీకి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్పడుతున్నారని.. మోంథా, దిత్వా తుఫాన్లను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ నిధులను భారీగా స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని పులికల్లు సమీపంలో కండలేరు స్పిల్‌వే కాలువ పనులు, నిమ్మ తోటలను మంగళవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎస్డీఎమ్మెఫ్, ఓ అండ్ ఎం కింద నిధులను ఒకే ఏడాదిలో మంజూరు చేయించుకొని పనులు చేయకుండానే దొంగ బిల్లులు సృష్టించారని ధ్వజమెత్తారు. కొత్తగా అవే పనులకు ఎఫ్డీఆర్ కింద నిధులు మంజూరు చేయించుకొని రూ.16.9 కోట్లను కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారని ధ్వజమెత్తారు. జిల్లా చరిత్రలో ఇలా ఇరిగేషన్ తాత్కాలిక పనుల కోసం ఇంత పెద్ద మొత్తంలో రూ.93.27 కోట్లను గతంలో మంజూరు చేయలేదని చెప్పారు. కలెక్టర్‌ను అధికార పార్టీ నేతలు తప్పుదారి పట్టించారో.. లేక ఒత్తిళ్లకు ఆయన లొంగి పనులు మంజూరు చేశారో అర్థంకావడం లేదన్నారు.
విచారణ జరిపితే జైలుకెళ్లడం ఖాయం
ఇరిగేషన్ పనులపై విచారణ నిర్వహిస్తే సోమిరెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు జైలుకెళ్లడం ఖాయమని కాకాణి చెప్పారు. తమ హయాంలో అవినీతి జరిగిందని సోమిరెడ్డి పదేపదే అంటున్నారని, ఇరిగేషన్ పనులపై బహిరంగ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కండలేరు స్పిల్‌వే పనుల కోసం తండ్రీకొడుకు హడావుడి చేశారని, కాలువ తవ్వించి 100 క్యూసెక్కులను సైతం విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వ సొమ్ముపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని, ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని ఇరిగేషన్ అధికారులివ్వడంలేదని ఆరోపించారు.
నష్టాన్ని అంచనా వేయాలి
దిత్వా తుఫాన్‌తో జిల్లాలో రైతులకు జరిగిన నష్టంపై వెంటనే అంచనాలేయాలని డిమాండ్ చేశారు. వీరిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. వరి పండించొద్దంటూ సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో నిమ్మ రైతులు నిలువునా నష్టపోయారని, తోటల్లో నీరు చేరి ఇప్పటికీ అలాగే ఉందని తెలిపారు. వర్షాలు తగ్గి వారమవుతున్నా, అంచనాలేసేందుకు అధికారులు రాలేదని చెప్పారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా యూరియాపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు విధించి కార్డులను అందజేస్తోందని ధ్వజమెత్తారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, విత్తనాలను ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, నేతలు ఎనిమిరెడ్డి పెంచలరెడ్డి, యాతం పెంచలరెడ్డి, నారాయణరెడ్డి, రామిరెడ్డి, రావుల ఇంద్రసేన్‌గౌడ్, పోలంరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, కోడూరు జనార్దన్‌రెడ్డి, సుందరయ్య, జనార్దన్, కోటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్వేపల్లిలో రూ.16.9 కోట్ల
స్వాహాకు స్కెచ్
ఒకే ఏడాదిలో పలు పద్దుల కింద పనులు
దోచుకునేందుకే
తుఫాన్ సమయంలో హడావుడి
ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి


