నేరాల కట్టడికి పటిష్ట చర్యలు
నెల్లూరు(క్రైమ్): నేరాల కట్టడి, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. నగరంలోని వేదాయపాళెం, నెల్లూరు రూరల్‌తో పాటు పొదలకూరు, రాపూరు పోలీస్‌స్టేషన్లను ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, పాతనేరస్తులు, పెండింగ్ కేసులు, నేర నియంత్రణకు చేపడుతున్న చర్యలు తదితరాలపై ఆరాతీశారు. రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల పరిష్కారానికి సూచనలిచ్చారు. ఇటీవల జరిగిన పలు కేసులకు సంబంధించిన వివరాలను ఆరాతీశారు. ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. నేరాలకు తరచూ పాల్పడే యాక్టివ్ రౌడీషీటర్లపై పీడీ యాక్ట్‌లను నమోదు చేయాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని, అక్రమార్కులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎస్పీ అజిత వేజెండ్ల తదితరులు పాల్గొన్నారు.


