కోటి సంతకాల సేకరణ విజయవంతం
నెల్లూరు సిటీ: కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది, కందుకూరు నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నియోజకవర్గ ఇన్‌చార్జీల ఆధ్వర్యంలో మహాయజ్ఞంలా సాగిందని చెప్పారు. తాము సేకరించిన సంతకాలను నియోజకవర్గ కేంద్రాల నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి ఊరేగింపుగా బుధవారం తీసుకురానున్నామని వెల్లడించారు. ప్రతులను గాంధీబొమ్మ సెంటర్ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ముగింపు సభను 15న నిర్వహించనున్నామని చెప్పారు. కోటి సంతకాలను గవర్నర్‌కు జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో 17న అందజేయనున్నామని ప్రకటించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు సైతం తమతో కలిపి నడిచాయన్నారు. కరుడుగట్టిన టీడీపీ మద్దతుదారులూ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు తెలిపారని వివరించారు. కార్యక్రమం విజయవంతం కావడంతో చంద్రబాబు, నేతలకు కడుపు మండిపోతోందని చెప్పారు. ఇండిగో వ్యవహారంలో వార్ రూమ్ నిర్వహించామని చెప్పుకొని టీడీపీ నవ్వులపాలైందని ఎద్దేవా చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. అనుకున్న దానికంటే ఎక్కువ సంతకాలను సేకరించామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


