నూరు శాతం రికవరీలు సాధించాలి
నెల్లూరు(పొగతోట): బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి, ఉన్నతి రుణాల రికవరీలను నూరు శాతం సాధించాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సూచించారు. నగరంలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ మండలాల్లో రికవరీల శాతం తక్కువగా ఉందని, దీనిపై దృష్టి సారించాలని సూచించారు. సంఘ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ.. తప్పులను సవరించుకుంటూ ముందుకుసాగాలని చెప్పారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బుక్ కీపింగ్‌ను సక్రమంగా నిర్వహించాలన్నారు. వెంకటాచలంలో మగ్గం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇక్కడ 30 మందికి శిక్షణిచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మిల్లెట్స్ వంటకాలపై కావలి మండలంలో శిక్షణ కార్యక్రమాలను త్వరలో నిర్వహించనున్నామని వెల్లడించారు. పండ్ల తోటలు సాగుచేసే సభ్యులు సోలార్ డ్రయర్లను ఉపయోగించుకొని అధిక అదాయాన్ని పొందొచ్చన్నారు. డీపీఎంలు మురళి, మధుసూదన్‌రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టెట్‌కు పక్కాగా ఏర్పాట్లు
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో బుధవారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్న టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు ఏర్పాట్లను పక్కాగా చేయాలని డీఆర్వో విజయకుమార్ పేర్కొన్నారు. టెట్ నిర్వహణపై కలెక్టరేట్లోని తన చాంబర్‌లో ఆర్డీఓ అనూషతో కలిసి మంగళవారం నిర్వహించిన పరీక్షల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆరు కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు 10,645 మంది హాజరుకానున్నారని వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు.
లైంగిక దాడి కేసులో
వృద్ధుడికి 20 ఏళ్ల జైలు
నెల్లూరు (లీగల్): ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని నమోదైన కేసులో కోవూరు మండలం పాటూరుకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు రాయదుర్గం వెంకటేశ్వర్లుకు ఇరవై ఏళ్ల జైలు, రూ.25 వేల జరిమానాను విధిస్తూ నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా (పోక్సో) కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. పాటూరులోని కామాక్షమ్మ కాలనీలో వెంకటేశ్వర్లు.. బాలిక నివాసం ఉంటున్నాడు. ఈ తరుణంలో 2021, ఏప్రిల్ 21న బేల్దారి పనులకు బాలిక తండ్రి వెళ్లారు. ఇంటి పనుల్లో తల్లి ఉండగా, ఉదయం పది గంటల సమయంలో వీధిలో బాలిక ఆడుకోసాగింది. ఈ తరుణంలో రూపాయిచ్చి.. మిఠాయి కొనిస్తానని మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై వెంకటేశ్వర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుడి వికృత చేష్టలకు భయపడిన బాలిక విషయాన్ని తల్లికి చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు నెల్లూరు దిశ పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్‌ను దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష, జరిమానాను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ దూబిశెట్టి చంద్రశేఖర్ వాదించారు.
సోలార్ ప్లాంట్‌కు స్టాంప్
డ్యూటీ మినహాయింపు
సాక్షి, అమరావతి: జిల్లాలోని కరేడులో ఏర్పాటు చేయనున్న సోలార్ పీవీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు ప్రభుత్వం రూ.14 కోట్లకుపైగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుపై మినహాయింపునిచ్చింది. ఏపీఐఐసీ ద్వారా సూర్యచక్ర డెవలపర్స్‌కు బదలాయించే భూముల రిజిస్ట్రేషన్ వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఎనిమిది వేల ఎకరాల్లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారని తెలిపింది.
నూరు శాతం రికవరీలు సాధించాలి


