నైపుణ్య పెంపుతో ఉపాధి అవకాశాలు
కొడవలూరు: నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలను పొందొచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మండలంలోని వెంకన్నపురంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని దక్షిణ భాగం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని, ఉత్తర భాగం అత్యంత వేగంగా డెవలప్ కానుందని వెల్లడించారు. రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్‌పోర్టు, ఇఫ్కో కిసాన్ సెజ్‌లో పరిశ్రమలు భారీగా రానున్నాయని, వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. వెంకన్నపురంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న క్రమంలో నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగావకాశాలను పొందాలని సూచించారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని కోరారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రాష్ట్ర చైర్మన్ కృష్ణయ్య, వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణి, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డీఎల్డీఓ వసుమతి, తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి, ఎంపీడీఓ వెంకటసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం రేపు
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్.. మాన్యువల్ స్కావెంజర్స్ కమిటీల సమావేశాలను కలెక్టర్ అధ్యక్షతన గురువారం ఉదయం నిర్వహించనున్నామని ఎస్సీ సంక్షేమ జిల్లా సాధికారిత అధికారి శోభారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.


