తీరుమారాలి.. లేదంటే బడితపూజే
● యువకులకు పోలీసుల కౌన్సెలింగ్
● ముమ్మరంగా తనిఖీలు
నెల్లూరు(క్రైమ్): రాత్రి వేళల్లో అకారణంగా రోడ్లపై ఉండి మాట్లాడుకోవడం, మద్యం మత్తులో వాహనాల్లో చక్కర్లు కొట్టడం, పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం, బహిరంగంగా మద్యం తాగితే సహించేది లేదు. తీరుమారాలి. లేనిపక్షంలో లాఠీ దెబ్బలు తప్పవని పోలీసు అధికారులు యువకులను హెచ్చరిస్తున్నారు. రెండు రోజులుగా పోలీసు అధికారులు రాత్రి వేళల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. అకారణంగా రోడ్లపై తిరుగుతున్న యువకులకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ చేశారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై 59 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై 45 కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని వాహనదారులపై ఎంవీ యాక్ట్ కింద 231 కేసులు నమోదు చేసి రూ.1,42,035ల జరిమానా విధించారు. పోలీస్ చర్యలతో రాత్రి రోడ్లపై తిరగాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
నెల్లూరు నగరంలో..
నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు జరిగాయి. బహిరంగంగా మద్యం తాగడంపై నాలుగు, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఆరు కేసులు నమోదు చేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను నిర్ణీత వేళల్లో మూయించి వేశారు. డ్రైవ్‌లో నెల్లూరు నగర ఇన్‌చార్జి, రూరల్ డీఎస్పీలు ఎం.గిరిధర్, ఘట్టమనేని శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్‌రెడ్డి, వైవీ సోమయ్య, బి.కల్యాణరాజు, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు, ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.


