ప్రభుత్వ హామీ.. మాటలకే పరిమితం
కందుకూరు: చంద్రబాబు ప్రభుత్వ మాటలకు చేసే పనులకు అసలు పొంతన ఉండదు. కందుకూరును చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించామని, చెత్త లేకుండా చేశామంటూ ఊదరగొట్టారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. అక్టోబర్ 2వ తేదీ నాటికి చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
గుట్టలుగా పేరుకుపోతూ..
స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ సీఎం చంద్రబాబు కందుకూరుకు వచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డులో సభ జరిగింది. మున్సిపాలిటీని చెత్త రహితంగా తీర్చిదిద్దుతామని, డంపింగ్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కనిగిరి రోడ్డులోని దూబగుంట వద్ద నూతన డంపింగ్ యార్డు, చెత్త ప్రాసెస్ మెషినరీని ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకూ ఆ యార్డుకు చెత్తను తరలించలేదు. మెషినరీ పూర్తిగా మూలనపడిపోయింది. అదే సందర్భంలో నాడు పట్టణంలోని గుర్రంవారి పాళెం ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డును స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు పరిశీలించారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి యార్డులో ఉన్న చెత్తను పూర్తిగా తొలగిస్తామని, చెత్త రహిత మున్సిపాలిటీగా మారుస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ అమలు కాలేదు. ఏళ్ల తరబడి కందుకూరు మున్సిపాలిటీని వేధిస్తున్న సమస్య అలాగే ఉంది.
కొండంత ఉన్నా..
ఇటీవల కాలంలో డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను ప్రాసెస్ చేసేందుకు తరుణి అసోసియేట్స్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. దీని ప్రకారం కొంత మెషినరీని ఏర్పాటు చేసిన సంస్థ ప్రక్రియను మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 26 వేల టన్నుల వరకు చెత్తను ప్రాసెస్ చేసింది. కాంట్రాక్ట్ ముగియడంతో వారు పనిని ఆపేశారు. వాస్తవానికి డంపింగ్ యార్డులో నేటికీ పేరుకుపోయి ఉన్న చెత్త 40 వేల టన్నుల వరకు ఉంది. ఇంకా రోజూ మున్సిపాలిటీలో చేపట్టే సేకరణ ద్వారా 25 టన్నుల వరకు చెత్త వచ్చిపడుతోంది. ఇప్పటికే కొండలా పేరుకుపోయిన చెత్త ఓవైపు కంపు కొడుతుంటే మరోవైపు కొత్తగా వచ్చి చేరుతున్న దాంతో సమస్య మళ్లీ మొదటికొచ్చినట్టు అయ్యింది. కాగా స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం డంపింగ్ యార్డు సమస్యను పూర్తిగా పరిష్కరించామంటూ ప్రచారాన్ని ఊదరగొడుతుండటం గమనార్హం. కానీ ప్రస్తుతం యార్డులో చెత్త ప్రాసెస్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో సమస్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే యార్డు సామర్థ్యాన్ని మించి పూర్తి స్థాయిలో నిండిపోయి కొత్తగా పోగవుతున్న దాంతో ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం తిరిగి కాంట్రాక్ట్ పునరుద్ధరిస్తే తప్ప డంపింగ్ యార్డులో ప్రాసెస్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మున్సిపల్ అధికారులు కూడా తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో కందుకూరును పట్టి వేధిస్తున్న చెత్త సమస్య ఇప్పటికే పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
డంపింగ్ యార్డులో రోజురోజుకూ పేరుకుపోతున్న చెత్త కుప్పలు
కాంట్రాక్ట్ పూర్తి కావడంతో
చెత్తశుద్ధిని నిలిపివేసిన సంస్థ
26 వేల టన్నులు ప్రాసెస్ పూర్తి, ఇంకా మిగిలింది 40 వేల టన్నులు
అక్టోబర్ 2 నాటికి పూర్తిగా తొలగిస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ హామీ
నేటికీ అలాగే సమస్య


