విత్తనాల కోసం వెతుకులాట
పొదలకూరు: జిల్లాలో దిత్వా తుఫాన్‌తో నార్లు దెబ్బతిన్న రైతులు విత్తనాల కోసం వెతుకులాడుతూనే ఉన్నారు. డీలర్ల వద్ద ధర అధికంగా పలకడంతోపాటు మొలకెత్తుతాయో లేదో అని సందేహపడుతున్న వారు రైతులు సొంతంగా ప్రాసెసింగ్ చేసిన విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. పొదలకూరు పరిసర ప్రాంత పెన్నార్ డెల్టా అన్నదాతలు బుచ్చిరెడ్డిపాళెం, దామరమడుగు, కోవూరు, బత్తులపల్లిపాడు తదితర ప్రాంతాలకు వెళ్లి వరి విత్తనాలను తెచ్చుకుని నార్లు పోసుకున్నారు. భారీ వర్షాల కారణంగా నార్లు, నాట్లు దెబ్బతినడంతో కొందరు తిరిగి నార్లు పోసుకోవాల్సి వస్తోంది. దిత్వా తుఫాన్‌తో ముసురుపట్టి వర్షం కురిసిన సమయంలో 20 శాతం మాత్రమే నార్లు పోసుకున్నారు. మరో 20 శాతం మంది ముసురులోనే నార్లు పోసుకోవడంతో భారీ వర్షాలకు నష్టపోయారు.
ఎన్నో ఇబ్బందులు
రైతులు వరిసాగు కోసం విత్తన సేకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్లో లభ్యమవుతున్న విత్తనాలు సరిపోవడం లేదు. దీనికితోడు సాగు చేయాలనుకునే రకాలు లభ్యం కాకపోవడంతో కర్షకులు గ్రామాలు తిరగాల్సి వస్తోంది. పొదలకూరు మండలం బత్తులపల్లిపాడులో సౌత్‌మోపూరుకు చెందిన వారు విత్తన శుద్ధి చేసి (ప్రాసెసింగ్) విక్రయిస్తున్నారు. కేఎన్‌ఎం 1638, ఆర్‌ఎన్‌ఆర్ 15048 (షుగర్ లెస్) రకాలను 25 కిలోల సంచి రూ.1,100కు అమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో కొందరు అన్నదాతలు అక్కడే విత్తనాలను తీసుకెళ్తున్నారు. మరికొందరు కేఎన్‌ఎం 12510, 7715 రకాలను సాగు చేస్తున్నారు. గతేడాదే జిల్లాలో ఈ రకాలను సాగు చేయడంతో పరిమితంగా విత్తనాలు లభ్యమవుతున్నాయి. దీంతో రైతులు 12510, 7715 రకం సాగు చేసిన వారి నుంచి విత్తనాలను సేకరించారు. ఈ రకం విత్తనాలు మంచి దిగుబడినిస్తుందని చెబుతున్నారు. కేఎన్‌ఎం 12510 రకం ఎకరాకు ఐదు పుట్లు దిగుబడినిస్తుందని సాధారణ రకం కంటే 20 రోజులు పంటకాలం పెరుగుతుందని అంటున్నారు. ప్రభుత్వం నుంచి విత్తనాలపై ఎలాంటి రాయితీ లేకపోవడం, అవసరమైనవి అందుబాటులో ఉంచకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
నార్లు పోసుకోవాలంటే
రైతులకు ఇబ్బందులు
దిత్వా తుఫాన్‌కు నీటి మునిగిన నారుమళ్లు
విత్తన సేకరణకే రూ.వేలు వెచ్చిస్తున్న వైనం
జిల్లాలో 20 శాతమే నార్లు పోసిన కర్షకులు
వరి విత్తనాలకు అందని రాయితీలు


