రైలెక్కుతుండగా..
● జారిపడి మహిళ మృతి
నెల్లూరు(క్రైమ్): కదిలే రైలు ఎక్కుతూ ఓ మహిళ ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫారం, రైలుకు మధ్యలో పడి మృతిచెందిన ఘటన ఆదివారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. అసోమ్ రాష్ట్రానికి చెందిన బి.సోనా (35) కుటుంబ సభ్యులతో కలిసి నాగాన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో తాంబరానికి బయలుదేరారు. రైలు స్టేషన్‌లో మూడోనంబర్ ప్లాట్‌ఫారంపై ఆగింది. సోనా వాటర్ బాటిల్, స్నాక్స్ కొనుక్కునేందుకు దిగి దుకాణం వద్దకు వెళ్లింది. ఇంతలో రైలు ముందుకు కదలడంతో ఆమె పరుగులు తీస్తూ ఎక్కే ప్రయత్నం చేయగా కాలు జారింది. దీంతో ఆమె రైలు కిందకు వెళ్లిపోయింది. ఫ్లాట్‌ఫారం, రైలుకు మధ్యలో ఇరుక్కుపోయి తీవ్రగాయమై మృతిచెందింది. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు ఎస్సై హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


