గర్భిణి మృతిపై అనుమానాలు
ఉదయగిరి: దుత్తలూరు మండలం నందిపాడులో షేక్ కుబ్రా అనే గర్భిణి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెది హత్య లేదా ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అత్తంటి వారు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కుబ్రా భర్త షేక్ మహ్మమద్ రఫీ, అత్త రసూల్‌బీని గురువారం అదుపులోకి తీసుకుని విచారించి పంపారు. శుక్రవారం వారిని కావలి డీఎస్పీ కార్యాలయంలో విచారించినట్లు సమాచారం. కుబ్రాకు ఆరునెలల క్రితమే వివాహమైంది. తల్లిదండ్రులు మృతిచెందగా సోదరి మాత్రమే ఉన్నారు. కుబ్రాను హత్య చేశారని, విచారణ జరిపించి న్యాయం చేయాలంటూ బంధువులు శుక్రవారం ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకార్ల సురేష్‌ను కలిసి విన్నవించారు. రెండు రోజులుగా ఉదయగిరి సీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం మృతదేహనికి శవపరీక్ష నిర్వహంచారు. రిపోర్టు అనంతరం కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
సీపీఎం నాయకుల అరెస్ట్
ఉలవపాడు: గుడ్లూరు మండలంలో భూ సేకరణ సమావేశానికి సీపీఎం నాయకులు వస్తారని పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌గా చేసి ఉలవపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కందుకూరులో ఉంటున్న సీపీఎం నాయకులు జీవీబీ కుమార్, గౌస్‌ను శుక్రవారం ఉదయం ఉలవపాడు స్టేషన్‌కు తీసుకొచ్చారు. గ్రామసభకు వెళ్తున్న గుడ్లూరు మండల కార్యదర్శి జి.వెంకటేశ్వర్లును చేవూరు వద్ద అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. చేవూరు గ్రామానికి చెందిన ఇరువూరి ఉపేంద్రబాబు, గోచిపాతల జక్రయ్య, రావూరుకు చెందిన కాకు మల్లికార్జున, మిరియం వెంకట్రావును గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఉలవపాడు స్టేషన్‌లో ఉంచారు. సాయంత్రం 3 గంటలకు సమావేశం పూర్తైన తర్వాత వారిని పంపించారు. ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి అరెస్ట్‌లు చేయడం దారుణమని నేతలు అన్నారు. పచ్చని భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు.
కలుజు దాటే ప్రయత్నం చేయొద్దు
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాళెం కలుజు వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కలుజు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు శుక్రవారం హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చేపల వేట, సెల్ఫీలు దిగే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
గర్భిణి మృతిపై అనుమానాలు


