బీపీసీఎల్ ఏర్పాటుతో ఉపాధి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
కందుకూరు: బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థ నెల్లూరు జిల్లాకు రావడం గర్వకారణమని, ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. బీపీసీఎల్ ఏర్పాటు వల్ల ప్రభావితమయ్యే గుడ్లూరు మండలంలోని రావూరు, చేవూరు, కావలి మండలంలోని చెన్నాయపాళెం, రుద్రకోట గ్రామాల ప్రజలతో కంపెనీ ప్రతినిధులు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభను శుక్రవారం రామాయపట్నం పోర్టు వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుడ్లూరు మండలం చేవూరు వద్ద ఐదు వేల ఎకరాల్లో రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ కంపెంనీ రిఫైనరీని ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రజల అభిప్రాయాలను నివేదిక రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తామన్నారు. స్థానికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కంపెనీ ప్రతినిధులు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చూడాలన్నారు. బీపీసీఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన రోజే యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే సంస్థకు కూడా శంకుస్థాపన ఏర్పాటు చేస్తామన్నారు. 70 శాతం ఉపాధి అవకాశాలను స్థానికులకే కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హిమవంశీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అశోక్‌కుమార్, కావలి ఆర్డీఓ చైతన్య తదితరులు పాల్గొన్నారు.


