ప్రాణం తీసిన అతివేగం
● లారీ ఢీకొని బేల్దారి మృతి
కోవూరు: కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళెం – చంద్రశేఖరపురం గిరిజన కాలనీ వద్ద నేషనల్ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెంలోని రేబాలకు చెందిన ఎస్‌కే ఇబ్రహీం (45) బేల్దారి పనిచేస్తుంటాడు. శుక్రవారం తెల్లవారుజామున పనికి వెళ్లేందుకు మోటార్‌బైక్‌పై నెల్లూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొట్టడంతో ఇబ్రహీం అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై ముత్యాలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇబ్రహీం మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా పెన్నానది నుంచి ఇసుక లారీలు, టిప్పర్లు ఈ రహదారిపై నిత్యం వేగంగా తిరుగుతుంటాయి. హెచ్చరిక బోర్డులు కూడా లేవు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పందించారు. ఈ రహదారిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీం మృతికి సంతాపం తెలిపారు.


