ఊపిరితిత్తులను కాపాడుకుందాం
● జిల్లాలో సుమారు
2.5 లక్షల మందికి సీఓపీడీ
● కాలుష్యం, పొగ, మైన్స్ దుమ్ము,
మద్యపానంతో పెరిగిన కేసులు
● జీవనశైలి మార్పుతోనే చెక్
● నేడు ప్రపంచ సీఓపీడీ
నివారణ దినోత్సవం
నెల్లూరు(అర్బన్): కొందరు పైకి ఆరోగ్యంగా కనిపిస్తారు. అయితే కొంత దూరం వేగంగా నడిచినా.. మెట్లు ఎక్కినా.. శ్రమతో కూడిన పనులు చేసినా ఆయాస పడుతుంటారు. వారికి శ్వాస తీసుకోవడం భారంగా అనిపిస్తుంది. ఇలాంటి వారిలో ఊపిరితిత్తుల్లోని గాలిసంచులు సంకోచ, వ్యాకోచాలు కోల్పోయి సాగిపోయి ఉంటాయి. శ్వాసకోశ నాళాలు వాపునకు గురై ఇరుగ్గా తయారవుతాయి. ఈ లక్షణాలున్న వారిని క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) రోగులంటారు. ఈ జబ్బు ముదిరితే ఊపిరితిత్తులు పనిచేయవు. దీంతో ఆయాసంతో ఆక్సిజన్‌పైనే ఉండి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జీవితం భారంగా మారుతోంది. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు గ్లోబల్ ఇన్షియేటివ్ ఫర్ క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ (గోల్డ్), ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ప్రతి సంవత్సరం నవంబర్ మూడో బుధవారం నాడు ప్రపంచ సీఓపీడీ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం ఊపిరి ఆడకపోవడం – సీఓపీడీ గురించి ఆలోచించిండి అనే థీమ్‌ను ప్రకటించింది.
ఎంతో మంది బాధితులు
జిల్లాలో సీఓపీడీతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు సుమారు 2.5 లక్షల మంది ఉన్నట్టు ఎన్‌సీడీ సర్వేతోపాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గణాంకాలు చెబుతున్నాయి. దూమపానం సీఓపీడీకి ప్రధాన కారణం. పొగ, మద్యం తాగేవారు, ఎక్కువగా ధూళి, దుమ్ము, కాలుష్యంలో పనిచేసేవారు, వాహనాల ఇంధన పొగను ఎక్కువగా పీల్చేవారు ఈ వ్యాధికి అధికంగా గురవుతున్నారు. చుట్ట, బీడీ, సిగరెట్ కాలుస్తున్న 30 ఏళ్ల పైబడిన వారితోపాటు వృద్ధులు జబ్బుకు గురవుతున్నారు. క్రానిక్ బ్రాంకై టిస్, ఎంఫెసిమా అనే రెండు రకాలుగా ఈ వ్యాధి ఉంటుంది. పొగతాగే వారి శ్వాసనాళాల్లో వాపు తలెత్తి క్రానిక్ బ్రాంకై టిస్ అనే జబ్బుకు కారణమవుతుంది. శ్వాసనాళాలతోపాటు శ్వాస గదులు పగిలిపోవడం, ఆక్సిజన్ సక్రమంగా సరఫరా కాకపోతే ఎంఫెసిమా సీఓపీడీ వస్తుంది. జిల్లాలో ఉన్న 52 పీహెచ్‌సీలు, 10 సీహెచ్‌సీలు, ఒక జిల్లా, రెండు ఏరియా ఆస్పత్రులు, ఒక సర్వజన ఆస్పత్రితోపాటు ప్రైవేట్ హాస్పిటళ్లకు సుమారు 25 శాతం మంది రోగులు ఆయాసంతో వస్తున్నారు. వీరిలో సుమారు 10 శాతం మంది సీఓపీడీ రోగులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
లక్షణాలు ఏంటంటే?
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఊపిరి ఆడకపోవడం, దీర్ఘకాలిక దగ్గు, గల్ల పడటం, గురకతోపాటు ఈల లాంటి శబ్దం రావడం, ఛాతి పట్టేసినట్టు అనిపించడం, అలసట తదితరాలు లక్షణాలుగా ఉన్నాయి. సీఓపీడీ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయించుకుంటే చాలా వరకు నియంత్రించవచ్చు. వృద్ధాప్యంతో ఆయాసం వచ్చిందని అనుకోకూడదు. సీఓపీడీ ఉన్నవారికి బ్రాంకో డైలేటర్స్ మందులు వాడటం వల్ల ఊపిరితిత్తులు వెడల్పు అవుతాయి. గాలి తీసుకోగలరు. కొన్ని రకాల స్టెరాయిడ్స్ వాపును తగ్గిస్తాయి. బెలూన్ ఊదటం లాంటి కొన్ని రకాల ఫిజియోథెరపీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొన్ని రకాల ఇన్‌హేలర్స్ వాడాలి. వ్యాక్సిన్‌లు తీసుకోవాలి. జీవనశైలిని మార్చుకోవడం ద్వారా సీఓపీడీకి చెక్ పెట్టొచ్చు.


