నారాయణా.. మీ భాష అభ్యంతరకరం
● ప్రజా చైతన్యానికి
రాజకీయ రంగు బాధాకరం
● మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘ప్రజల మద్దతు లేకుండా ఎలాంటి ఉద్యమాలు జరగవు. ఈ విషయం తెలుసుకోకుండా మంత్రి నారాయణ వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది’ అని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిడ్జి విషయంపై రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రజా చైతన్యానికి మంత్రి రాజకీయ రంగు పులమడం బాధాకరమన్నారు. గతంలో ఎన్నోసార్లు ఫ్లై ఓవర్ గురించి మాట్లాడాలని అడిగినా ముందుకురాని మంత్రి, ప్రజల పోరాటాలతో ప్రకటన చేయడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు వారి సమస్యలపై ఏమీ మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. అధికారంలో లేని సమయంలో నారాయణ తమతో కలిసి ధర్నాలో పాల్గొని మాట్లాడిన సందర్భాలున్నాయని గుర్తు చేసుకోవాలన్నారు. చింతారెడ్డిపాళెం జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ మంజూరైందని 15 సంవత్సరాలుగా వింటున్నామన్నారు. ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదని, అలాంటి చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పనులు ప్రారంభించే వరకు ప్రజలు పోరాటాలు చేస్తామన్నారు. కమిటీ కన్వీనర్ కాయం శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు కోటిరెడ్డి, రామకృష్ణ, నారాయణరెడ్డి పాల్గొన్నారు.


