డేగపూడి వద్ద కూలిన కల్వర్టు
● స్తంభించిన రాకపోకలు
పొదలకూరు: మండలంలోని రాపూరు – పొదలకూరు మార్గం డేగపూడిరాజుపాళెం వద్ద కల్వర్టు కూలిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. కొద్దిరోజులుగా కల్వర్టు ఓవైపు దెబ్బతినడంతో తాత్కాలికంగా మరోవైపు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మోంథా తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలకు కల్వర్టు బాగా నానిపోయింది. దీంతో సోమవారం రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికి మంగళవారం పూర్తిగా కూలిపోయింది. ఫలితంగా రాపూరు వయా పొదలకూరు మీదుగా నెల్లూరుకు రాకపోకలు స్తంభించాయి. దీంతో ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కల్వర్టు పూర్తిగా కుంగిపోయిన సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోకలు సాగించకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు.


