టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
● మరొకరికి తీవ్రగాయాలు
ముత్తుకూరు(పొదలకూరు): మోటార్‌బైక్‌ను టిప్పర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ముత్తుకూరు మండలంలోని పాటూరువారికండ్రిక మద్దిమాను సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన వీడియోగ్రాఫర్ రాయని కుమార్ (44), అజ్మతుల్లా చిల్లకూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బలో అయ్యప్ప స్వాముల భజన వీడియో, ఫొటోలు తీసేందుకు సోమవారం వెళ్లారు. రాత్రి తిరిగి నెల్లూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో బైక్‌ను వెనుక నుంచి వేగంగా టిప్పర్ ఢీకొట్టింది. కింద పడిపోయిన కుమార్ పైనుంచి టిప్పర్ వెళ్లింది. దీంతో అతను చనిపోగా అజ్మతుల్లా తీవ్రంగా గాయపడ్డారు. కుమార్ నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో, అజ్మతుల్లా బీవీ నగర్‌లో నివాసముంటున్నారు. సమాచారం అందుకున్న ముత్తుకూరు ఎస్సై ప్రసాద్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రుడిని నెల్లూరు ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.


