బస్సుకు మరమ్మతులు చేస్తుండగా..
● ఒక్కసారిగా స్టార్ట్ చేసిన డ్రైవర్
● మెకానిక్‌కు తీవ్ర గాయాలు
● డ్రైవర్ మద్యం మత్తులో
ఉన్నాడా అని విచారణ
కోవూరు(బుచ్చిరెడ్డిపాళెం రూరల్): డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం రాత్రి కోవూరులో జరిగింది. నెల్లూరు 2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో కావలి వైపునకు బయలుదేరింది. కోవూరులోని చౌదరి పెట్రోల్ బంక్ సమీపంలో ఆగిపోయింది. దీంతో మెకానిక్ వచ్చి బస్సు కిందకు వెళ్లి పరిశీలిస్తున్నాడు. ఈ సమయంలో డ్రైవర్ ఒక్కసారిగా బస్సును స్టార్ట్ చేసి ముందుకెళ్లాడు. అక్కడున్న వారు కేకలు వేశారు. మెకానిక్ భయపడి పక్కకి జరిగాడు. ఈ క్రమంలో అతడి వీపుపై గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ మద్యం తాగాడా? లేదా? అని ఆరా తీస్తున్నారు. విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గాయపడిన మెకానిక్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


