గ్యాస్ లీకై పేలిన సిలిండర్
● తప్పిన ప్రమాదం
సంగం: గ్యాస్ లీకై సిలిండర్ పేలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మండలంలోని దువ్వూరులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. దువ్వూరులో పులివర్తి వెంకటసుబ్బానాయుడు అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతను కొరియర్ సంస్థలో పనిచేస్తున్నాడు. బుధవారం గ్యాస్ లీకై ప్రమాదం చోటుచేసుకుంది. భారీ శబ్దం వచ్చింది. ఇంటి లోపలి భాగం, సామగ్రి దెబ్బతిన్నాయి. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని నివారించారు. రూ.18 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. సిలిండర్ పేలుడుకు కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకున్నారు.
మహిళపై దౌర్జన్యం
● ఇంట్లో సామగ్రి బయట వేసిన వైనం
వింజమూరు(ఉదయగిరి): వింజమూరులోని బంగ్లా సెంటర్‌లో నివాసముంటున్న అబీబున్నీసా అనే మహిళపై బుధవారం రాత్రి నెల్లూరుకు చెందిన ఓ గ్యాంగ్ దౌర్జన్యం చేసింది. సామగ్రిని రోడ్డుపై పడేసింది. బాధితురాలి కథనం మేరకు.. అబీబున్నీసా భర్త కొన్నేళ్ల క్రితం వేరే పెళ్లి చేసుకుని నెల్లూరులో కాపురం ఉంటున్నాడు. అతను ఇల్లు అమ్మేశాడని, తాము కొనుగోలు చేశామంటూ గ్యాంగ్ వచ్చి దౌర్జన్యం చేసింది. 15 ఏళ్ల నుంచి తామే ఉంటున్నామని, ఇది అమ్మ ఆస్తి అని ఆమె చెబుతున్నారు. గతంలో కూడా పలుమార్లు దౌర్జన్యం చేయగా పోలీసులకు ఫిర్యాదు చేశామని, పట్టించుకోలేదని వాపోయారు. దీని వెనుక కొందరు పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. విలువైన ఆస్తిని ఆక్రమించి తనను, బిడ్డలను రోడ్డుపాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలి కోరారు.
గ్యాస్ లీకై పేలిన సిలిండర్


