తెలుగుభాష పరిరక్షణ అందరి బాధ్యత
● వీసీ అల్లం శ్రీనివాసరావు
వెంకటాచలం: తెలుగుభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. వీఎస్‌యూ తెలుగు శాఖ, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీలో బుధవారం తెలుగుభాష పరిరక్షణ, పరిశోధన తదితర అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక యుగంలో భాష పరిరక్షణ కేవలం పండితుల బాధ్యత కాదని, తెలుగు వారి ధర్మమని చెప్పారు. మాతృభాషలో ఆలోచించడం మన సృజనాత్మకతకు బలం అందిస్తున్నారు. భాషను సంరక్షించేందుకు విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, విద్యార్థులు, ప్రజలు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సులో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్, సుప్రసిద్ధ అవధాని డాక్టర్ మేడసాని మోహన్, తెలుగు భాష పరిరక్షణ గురించి మాట్లాడారు. సదస్సులో వీఎస్‌యూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్ మాడభూషి సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


